యాప్నగరం

బండి సంజయ్‌లా నేను మాట్లాడలేను: అందరూ దేవుళ్లే కదా.. పవన్ కళ్యాణ్ ఆలోచింపజేసే మాటలు

Pawan Kalyan: తిరుపతి ఉప ఎన్నికలో బైబిల్, భగవద్గీత పార్టీల్లో దేనికి ఓటేస్తారన్న బండి సంజయ్ మాటలకు పవన్ కళ్యాణ్ ఆలోచింపజేసేలా..

Samayam Telugu 22 Jan 2021, 7:29 pm
‘భగవద్గీత పార్టీ కావాలా.. బైబిల్ పార్టీ కావాలా...’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. తిరుపతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బైబిల్, భగవద్గీత, ఖురాన్.. ఏదైనా దేవుడి వాక్కే కదా. నేను వ్యక్తిగతంగా ఇలా విడగొట్టలేను.. సమాజాన్ని అంతగా విడగొట్టడం అంటే చాలా ఇబ్బంది.. నేను అలా మాట్లాడలేను.’’ అని కుండబద్దలు కొట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, తాను ఆ మాదిరిగా విడగొట్టి మాట్లాడలేనన్నారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్, బండి సంజయ్


అలాగే బండి సంజయ్ ఏ సందర్భంలో అలా మాట్లాడి ఉంటారో తనకు తెలియదని పవన్ కళ్యాణ్ అన్నారు. దేవాలయాల దాడుల విషయంలో ఆవేదన చెంది బండి సంజయ్.. ఆ విధంగా మాట్లాడి ఉంటారన్నారు. ఆ స్థాయి వ్యక్తి మనసులో అలా ఉండి ఉంటే ప్రపంచం ఇలా ఉండదని పవన్ బదులిచ్చారు. తనకు ముస్లింలు, క్రైస్తవుల్లో కూడా విపరీతంగా అభిమానులు ఉన్నారని చెప్పారు. మతం అనేది చాలా సున్నితమైన అంశమని.. సమాజాన్ని విడదీసేలా తాను మాట్లాడలేనని చెప్పారు.

అలాగే మతాన్ని కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఆపాదించొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగైతే వైసీపీ నేతలు కూడా బైబిల్ పట్టుకుని ప్రచారం చేశారు కదా అని ప్రశ్నించారు. సగటు భారతీయుడిగా.. అందరికీ సమాన హక్కులు ఉండాలని తాను కోరుకుంటానని చెప్పారు.

ఇక, రైతు సమస్యలపై స్పందించిన బలంగా రామతీర్థం విషయంలో రియాక్ట్ కాలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎందుకంటే మతం అనేది సున్నితమైన అంశమని.. రామతీర్థ యాత్రలో తాను పాల్గొంటే వచ్చే భావోద్వేగాలు వేరుగా ఉంటాయన్నారు. అనవసరంగా అమాయకులు బలి అయ్యే అవకాశం ఉందని, తన అభిమానులు అన్ని మతాల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. దోషులను పట్టుకోవాలన్నది తమ డిమాండ్ అన్నారు. ప్రభుత్వం ఆనాడే పట్టించుకుంటే ఈ గొడవే ఉండేది కాదని పవన్ కళ్యాణ్ ఆలోచింపజేసే విధంగా మాట్లాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.