యాప్నగరం

జగన్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్.. మరో రిక్వెస్ట్

అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సీబీఐ పరిమితం కారాదన్నారు జనసేనాని. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయి.. వీటి వెనుక ఎవరు ఉన్నారో సీబీఐ నిగ్గు తేల్చాలి అన్నారు.

Samayam Telugu 11 Sep 2020, 6:39 am
జగన్ సర్కార్ నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగించడంపై స్పందించారు. ఇది తొలి అడుగు మాత్రమే అని.. అంతర్వేది సంఘటనలో సీబీఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడం అంటే పరిష్కారం అయినట్టు కాదన్నారు. నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమే అన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోంది అన్నారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్

అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సీబీఐ పరిమితం కారాదన్నారు జనసేనాని. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండ బిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సీబీఐ నిగ్గు తేల్చాలని.. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయి అన్నారు. కాబట్టి పిఠాపురం, కొండ బిట్రగుంటల్లోని ఘటనల్నీ సీబీఐ పరిధిలోకి తీసుకువెళ్లాలని కోరారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయని.. ఈ ఆలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు ఆన్యులపరమైపోయాయన్నారు. వీటి గురించీ సీబీఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలని కోరారు.

తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సీబీఐ ఆరా తీయాలని.. ఆ పింక్ డైమండ్ ఏమైపోయినదనే అంశంపై రమణ దీక్షితులు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారని గుర్తు చేశారు. ఆ వజ్రం ఎటుపోయిందో ఆరా తీయాలని.. తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ ఆరా తీయాలన్నారు. భవిష్యత్తులో ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా దుశ్చర్యలు జరగకూడని జనసేన కోరుకుంటోందని.. అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విచారణ విషయంలో ప్రభుత్వం ఆమోదకర చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతుందని.. శుక్రవారం నాటి 'ఛలో అంతర్వేది' కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు తెలిపారు. అయితే ధర్మ సంస్థాపనార్ధం తలపెట్టిన మహిళల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందన్నారు. దర్యాప్తు అంటే గొడవ జరిగిందని అర్థం.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే 'మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి'.. దాని వైపు వేసే తొలి అడుగే అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.