యాప్నగరం

కోడెల ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..

TDP సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య కేసులో పోస్టుమార్టం రిపోర్టు తమకు అందలేదని పోలీసులు తెలిపారు. కోడెల సెప్టెంబర్ 16న ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 15 Dec 2019, 3:30 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి సంబంధించిన కేసులో తమకు ఇప్పటి వరకూ పోస్టుమార్టం రిపోర్టు అందలేనది హైదరాబాద్ పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో సెప్టెంబర్ 16, 2019న కోడెల ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ నేత అయిన కోడెల ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో కోడెల కుటుంబ సభ్యులను బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.
Samayam Telugu kodela


జగన్ సర్కారు వేధింపుల వల్లే తమ తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని కోడెల కుమార్తె విజయలక్ష్మి ఆరోపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఏపీ సర్కారు తన తండ్రిపై తప్పుడు కేసులు మోపిందని.. రాజకీయంగా ప్రతీకార దాడులకు పాల్పడిందని ఫిర్యాదులో విజయలక్ష్మీ పేర్కొన్నారు. కోడెలతోపాటు కుటుంబ సభ్యులను ప్రభుత్వం మానసికంగా వేధిస్తోందని.. డిప్రెషన్లోకి వెళ్లిన తన తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు.

కోడెల మృతి కేసు విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్న ప్రదేశంలో.. లభ్యమైన వస్తువులను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. కానీ పోస్టుమార్టానికి సంబంధించిన నివేదిక ఇప్పటి వరకూ అందకపోవడం గమనార్హం. మరో పది రోజుల్లోగా ఈ రిపోర్ట్ పోలీసులకు అందే అవకాశం ఉంది. కీలకమైన పోస్టుమార్టం నివేదిక రాగానే.. దర్యాప్తు వేగవంతం కానుంది.

వృత్తిరీత్యా డాక్టర్ అయిన కోడెల శివప్రసాద రావు.. ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీని స్థాపించిన కొత్తలోనే ఆ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ సన్నిహితుడిగా మెలిగిన కోడెల.. ఆయన హయాంలోనే హోం మంత్రిగా పని చేశారు. ఐదుసార్లు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి సత్తెనపల్లి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ అసెంబ్లీ మొదటి స్పీకర్‌గా కోడెల పనిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.