యాప్నగరం

అమరావతి ఉద్యమం: పల్నాడులో పోటెత్తిన జనం.. ఫలిస్తున్న చంద్రబాబు వ్యూహం

అమరావతి ఉద్యమంపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటి వరకూ అమరావతికే పరిమితమైన ఉద్యమాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించే దిశగా ముందడుగేస్తున్నారు.

Samayam Telugu 12 Jan 2020, 11:21 pm
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ జేఏసీ చేపట్టిన ఉద్యమం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటి వరకూ అమరావతి, విజయవాడకే పరిమితమైన ఉద్యమం క్రమంగా ప్రధాన నగరాలకు విస్తరిస్తోంది. నిన్న చిత్తూరు జిల్లాలో ర్యాలీ చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ రోజు గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు కూడగట్టేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
Samayam Telugu chandrabau


అందులో భాగంగానే క్రమంగా ఉద్యమాన్ని జిల్లాల బాట పట్టించారు. నిన్న చిత్తూరు జిల్లాలో చేపట్టిన ర్యాలీకి పెద్దఎత్తున జనం తరలివచ్చారు. అనంతరం నరసరావుపేటలో చేపట్టిన ర్యాలీకి టీడీపీ శ్రేణులు కదంతొక్కాయి. అటు పార్టీ నేతల్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు అమరావతి ఉద్యమాన్ని దీటుగా ముందుకు తీసుకెళ్లే బహుముఖ వ్యూహంతో చంద్రబాబు అడుగులేస్తున్నారు. అమరావతికి మద్దతుగా చేపడుతున్న ర్యాలీలకు జనం తరలిరావడంతో ఇదే ఊపుతో ఉద్యమాన్ని కొనసాగించేందుకు అధినేత సన్నద్ధమయ్యారు.

పల్నాడు ప్రాంతానికి కోటగా పేరొందిన నరసరావుపేటలో చంద్రబాబు చేపట్టిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. చంద్రబాబు ర్యాలీగా కదులుతూ అమరావతికి ఉద్యమానికి మద్దతుగా జోలెపట్టి విరాళాలు సేకరించారు. నరసరావుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన అమరావతి పరిరక్షణ ర్యాలీకి పల్నాటి జనం పోటెత్తారు. భారీగా హాజరైన మహిళలు గొలుసులు, గాజులు, ఉంగరాలను విరాళంగా అందజేశారు.

Also Read: జిమ్మిక్కులొద్దు.. సూటిగా చెప్పు.. రాజధానిపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

ర్యాలీ అనంతరం పల్నాడు బస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ సర్కార్ విధానాలపై విరుచుకుపడ్డారు. ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. ఉద్యమ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మల్లమ్మసెంటర్, శివుని బొమ్మ, గడియార స్తంభం మీదుగా సాగింది.

నరసరావుపేటలో చేపట్టిన ర్యాలీకి పల్నాడు ప్రాంత టీడీపీ నేతలు తరలివచ్చారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. అమరావతికి మద్దతు తెలిపిన పలు విపక్షాల నేతలు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. చంద్రబాబు వెంట నడుస్తూ అమరావతి ఉద్యమం కోసం విరాళాలు సేకరించారు. అయితే మహిళలు అందజేసిన బంగారు ఆభరణాలకు సంబంధించి జేఏసీ నేతలు కీలక ప్రకటన చేశారు. ఆ ఆభరణాలను విక్రయించబోమని.. అమరావతిలో మ్యూజియం ఏర్పాటు చేసి భద్రపరచనున్నట్లు వెల్లడించారు.

Read Also:
పృథ్వీ ప్రెస్‌మీట్‌: స్వామివారిపై ఒట్టేసి చెబుతున్నా.. అదే నిజమైతే నాశనమైపోతా.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.