యాప్నగరం

మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌.. నన్నపనేని రాజీనామా, ఆలస్యానికి కారణమిదే!

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. రెండు నెలల క్రితమే కొత్త చైర్ పర్సన్ పేరును ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఆమె రాజీనామా ఆలస్యమైంది.

Samayam Telugu 7 Aug 2019, 4:12 pm
ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కి అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశానని తెలిపారు. ‘‘మూడేళ్ల వార్షిక నివేదికను గవర్నర్‌కు అందజేశా. నా నివేదికను చూసి గవర్నర్‌ అభినందించారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదిక అడ్డంకిగా మారింది. నా హయాంలో బాధిత మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచా’’నని ఆమె తెలిపారు.
Samayam Telugu nannapaneni1


వసతి గృహాల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉందన్న నన్నపనేని.. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలన్నారు. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు.

వాస్తవానికి ప్రభుత్వం మారినా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవిలో కొనసాగాలని నన్నపనేని రాజకుమారి భావించారు. అందుకే జగన్ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాక ఆయన్ను కలిసేందుకు క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. కానీ జగన్ అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో.. ఆమె నిరాశగా వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం మారడానికి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు మరో రెండేళ్ల పదవీ కాలం ఉందన్నారు.

కానీ నామినేటెడ్ పదవులను తమ పార్టీ నేతలతో భర్తీ చేస్తున్న జగన్.. నన్నపనేని వినతి పట్ల సానుకూలంగా స్పందించలేదు. మహిళా కమిషన్ చైర్‌పరన్స్‌గా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మను నియమించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నన్నపనేని స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన పద్మను నియమించి.. సామాజిక న్యాయాన్ని బ్యాలెన్స్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.