యాప్నగరం

ఏపీకి ముంచుకొస్తున్న నివర్ తుఫాన్.. ఆ రెండు జిల్లాలకు డేంజర్ అలర్ట్

తీరం దాటేప్పుడు గంటకు 100 కి.మీ నుంచి 120 కి.మీ దాకా గాలులు వీచే అవకాశముంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారుల్ని హెచ్చరించారు.

Samayam Telugu 24 Nov 2020, 6:42 am
నివర్ తుఫాన్ ముప్పు ఏపీని వెంటాడుతోంది. తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది. నివర్ బుధవారం తీవ్ర తుఫాన్‌గా తీరం దాటాక.. అదేరోజు అదే తీవ్రతతో చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆ జిల్లా మీదుగా వెళుతుండగానే అది వాయుగుండంగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈనెల 25, 26న అతి భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారుల్ని హెచ్చరించారు. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నంలో మొదటి ప్రమాదహెచ్చరిక ఎగురవేశారు.
Samayam Telugu నివర్ తుఫాన్ (File Photo)


పుదుచ్చేరిలోని కరైకల్‌, తమిళనాడులోని మామల్లపురం మధ్య తీరం దాటేప్పుడు గంటకు 100 కి.మీ నుంచి 120 కి.మీ దాకా గాలులు వీచే అవకాశముంది. చిత్తూరు జిల్లాలోకి కూడా దాదాపు ఇదే తీవ్రతతో రావొచ్చని వాతావరణశాఖ చెబుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మంగళవారం తమిళనాడులో భారీ వర్షాలు పడతాయంటున్నారు.

నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీరం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుందని.. ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో అనేకచోట్ల మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. తుఫాన్ హెచ్చరికలతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. విపత్తు నిర్వహణశాఖ పరిస్థితిని సమీక్షిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.