యాప్నగరం

కోర్టు ధిక్కరణ కేసు.. అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు

సిబ్బంది జీతాల చెల్లింపు విషయంలో మూడేళ్ల కిందట తాము ఇచ్చిన ఆదేశాలను అమలుచేయకుండా తాత్సారం చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష ఖరారుచేసింది.

Samayam Telugu 1 Jan 2021, 7:01 am
కోర్టుధిక్కరణ కేసులో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకు హైకోర్టు శిక్ష విధించింది. హైకోర్టు పనిగంటలు ముగిసే వరకు కోర్టు హాలులోనే కూర్చోవాలని గురువారం వెల్లడించింది. దీంతో పాటు రూ.1,000 జరిమానా కూడా చెల్లించాలని సూచించింది. ఒకవేళ జరిమానాను చెల్లించడంలో విఫలమైతే ఏడు రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఈ మేరకు తీర్పును వెలువరించారు. కోర్టు తీర్పుతో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు హైకోర్టు పనిగంటలు ముగిసే వరకు హాలులోనే కూర్చుని, జరిమానాను చెల్లించారు.
Samayam Telugu ఏపీ హైకోర్టు
Andhra Pradesh high court


వాస్తవానికి అసెంబ్లీ కార్యదర్శికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. అయితే... తన వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెసులుబాటు కల్పించాలని బాలకృష్ణమాచార్యులు కోర్టుకు విన్నవించుకున్నారు. భవిష్యత్తులో కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో మరింత జాగ్రత్త వహిస్తానని హామీ ఇచ్చారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మానవతాదృక్పథంతో తీర్పును సవరించారు.

అసెంబ్లీలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పిటిషనర్లు/టైపిస్టులు, ఆఫీసు అసిస్టెంట్లకు ఇంక్రిమెంట్లు, జీతాల విషయమై 2017 ఫిబ్రవరిలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఆ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో సిబ్బంది కోర్టుధిక్కరణ కింద వ్యాజ్యాలు దాఖలు చేశారు. గతంలో దీనిపై విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం.. తీర్పును వెలువరించలేదు. శిక్ష విధించే నిమిత్తం గురువారానికి ఈ కేసును వాయిదా వేశారు. గురువారం జరిగిన విచారణలో జస్టిస్ దేవానంద్ తీర్పును వెల్లడించారు.

తమ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఆర్ధిక శాఖ కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, అకౌంట్స్ ఆఫీసర్ మోహనరావు, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు నోటీసులు జారీచేసింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలియజేస్తూ అఫిడ్‌విట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అసెంబ్లీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించిన కోర్టు ఆయనకు శిక్ష విధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.