యాప్నగరం

ఏపీలో మరో ఎన్నికల సమరం.. మూణ్నెళ్లే గడువు!

మూణ్నెళ్లలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సంబంధిత ఉన్నతాధికారి ద్వారా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 18కి విచారణ వాయిదా వేసింది.

Samayam Telugu 5 Nov 2019, 10:43 pm
ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి పార్టీలు సమాయత్తమయ్యే సమయం వచ్చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు మరో మూడు నెలల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. స్థానిక సంస్థలకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టుకు నివేదించారు.
Samayam Telugu amaravati


అయితే మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధిత ఉన్నతాధికారి ద్వారా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది. విజయవాడకు చెందిన ఎ.వేణుగోపాలకృష్ణమూర్తి దాఖలు చేసిన పిల్‌పై బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

Also Read: ‘సీఎస్ ఎల్వీ బదిలీ.. క్రిస్టియన్ మిషనరీ మాఫియా ఒత్తిడితోనే..’

పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో విపక్షాలు పోరుకు సన్నద్ధమవుతున్నాయి. ఇసుక కొరత.. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరితో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని విపక్షాలు భావిస్తున్నాయి. ఈ సమయంలో ఎన్నికలు వస్తే ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నాయి. సంక్షేమ పథకాలు, సచివాలయ వ్యవస్థ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన తదితర అంశాలు కలిసి వస్తాయని అధికార వైఎస్సార్సీపీ భావిస్తోంది.

ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ గతంలోనే ప్రకటించారు. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీలకు 6.77 శాతం కోటా ఉంటుందని చెప్పారు. రిజర్వేషన్లపై రాజ్యంగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వాదనలున్నాయి. ఎన్నికల నాటికి ఇబ్బందులను అధిగమించి స్థానిక పోరులోనూ సత్తాచాటాలని అధికారపార్టీ ఉవ్విళ్లూరుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.