యాప్నగరం

ప్రభుత్వ విప్ పదవి వద్దన్న ఆ ఎమ్మెల్యేకు జగన్ కీలక బాధ్యతలు!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి భర్తీ చేయలేదు. దీంతో ఆశావాహులకు ఎదురుచూపులు తప్పడంలేదు.

Samayam Telugu 23 Aug 2019, 11:54 am
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటేడ్ పదవుల పందేరానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలను ఈ పదవుల్లో నియమించనున్నారు. ఇప్పటికే మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. అలాగే మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న మరికొందరు కీలక నేతలకు నామినేషన్ పదవులతో బుజ్జగించనున్నారు. వీరిలో కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే, కొలుసు పార్థసారథికి పదవి దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఆయనకు రీజినల్ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించనున్నారు. త్వరలో వీటికి సంబంధించిన ఆదేశాలు జారీచేయనున్నారని వైఎస్‌ఆర్‌సీపీ వర్గాలు అంటున్నాయి.
Samayam Telugu Jagan3


ఏపీలోని 13 జిల్లాలను అయిదు ప్రాంతీయ మండళ్లుగా విభజించి ఛైర్మన్లను నియమించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయ్యాయి. ఈ మండళ్లు వైఎస్‌ హయాంలోనే తెరమీదకు వచ్చాయి. కృష్ణా, గుంటూరు లేదా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను కలిపి ఒక మండలిగా ఏర్పాటు చేయనున్నారని అంటున్నారు. ఈ బోర్డుకు కొలుసు పార్థసారథిని ఛైర్మన్‌గా నియమించనున్నారు.

ఈ ఎన్నికల్లో పెనమలూరు నుంచి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచిన ఆయన మంత్రి పదవిని ఆశించారు. పలు సమీకరణాల అనుకూలిస్తాయని, సీనియర్‌ నేత కావడం గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ ఆయనకు ఆశలకు జగన్ గండికొట్టారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌లకు మంత్రి పదవి లభించింది.

అయితే, పార్థసారథిని ప్రభుత్వ విప్‌గా జగన్ నియమించినా, ఆ పదవిని తీసుకోడానికి ఆయన ఆసక్తి చూపలేదు. దీంతో ఆ పదవి ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు దక్కింది. తాజాగా ప్రాంతీయ అభివృద్ధి మండలి ఛైర్మన్‌ పదవి దక్కనుందనే ప్రచారం సాగుతోంది. దీనిపై పార్థసారథిని సంప్రదించగా తనకు ఇంకా సమాచారం లేదని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.