యాప్నగరం

Telangana Formation Day: ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. ఎందుకు చెప్పారు?

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా శుభాకాంక్షలు తెలిపారు.

Samayam Telugu 2 Jun 2020, 2:21 pm
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మోదీ విషెస్ చెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాన’’ని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.
Samayam Telugu ప్రధాని మోదీ
pm modi extends wishes to andhra pradesh people


జూన్ 2న తెలంగాణ ప్రజలు ఆనందోత్సాహాల నడుమ అవతరణ దినోత్సవం జరుపుకొంటే.. ఆంధ్రప్రదేశ్‌లో దీనికి భిన్నమైన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటుకు నిరసనగా నాటి సీమాంధ్ర ప్రజానీకం సమైక్యాంధ్ర ఉద్యమం చేశారు. రాష్ట్రం విడిపోయినందుకు సమైక్యవాదులు బాధతో ఉంటారు. అంతేకాదు చంద్రబాబు హయాంలో జూన్ 2న నవ నిర్మాణ దీక్షలను చేపట్టేవారు. కానీ ప్రధాని మోదీ జూన్ 2న ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు తెలంగాణకు శుభాకాంక్షలు చెబుతూ ప్రధాని చేసిన ట్వీట్‌తో పోలిస్తే ఇది మరింత వైరల్ అయ్యింది.

రాష్ట్రం విడిపోయిన రోజు రెండు కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయనే భావనతో మోదీ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే.. తెలంగాణ విడిపోవడంతో పాత ఆంధ్ర రాష్ట్రమే ఆంధ్ర ప్రదేశ్‌గా మిగిలింది. దీంతో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలని గతంలో చంద్రబాబు హయాంలో అధికారులు కేంద్రం హోం శాఖకు లేఖ రాశారు.

దీనికి స్పందించిన హోం శాఖ.. ఆంధ్రప్రదేశ్‌ ఒరిజనల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో మాదిరిగానే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. దేశంలో విడిపోయిన నాలుగు రాష్ట్రాలు విభజన తేదీ నాడే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, మాతృ రాష్ట్రాలు మాత్రం పాత అవతరణ తేదీ నాడు దినోత్సవాలను చేసుకుంటున్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలపడం పట్ల కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. ‘‘దన్యవాదములు, శుభాకాంక్షలు దేనికో వివరిస్తారా, ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వకుండా మోసం చేయగలిగినందుకా, కేసులలో బెయిల్ మీద వున్న ముద్దాయిని ముఖ్యమంత్రి ని చేసి తద్వారా ప్రత్యేక ప్రతిపత్తి అడగకుండా చేయగలిగినందుకా’’ అంటూ ఓ నెటిజన్ బదులిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరికొందరు మోదీని రిక్వెస్ట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.