యాప్నగరం

మరో రాష్ట్రంలో ఏపీ తరహా సేవలు.. ఆప్ ప్రభుత్వం కూడా సై..!

పంజాబ్‌లోనూ ఆంధ్రప్రదేశ్ తరహాలో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే విధానాన్ని రూపొందిస్తున్నారు. ఏపీని స్ఫూర్తిగా తీసుకుని లబ్ధిదారుల చెంతకే రేషన్ అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్‌ ఈ పథకంపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 1 May 2022, 7:38 am
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను ఇతర రాష్ట్రల్లో కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె తమిళనాడు ప్రభుత్వం ఏపీ తరహాలో సచివాలయ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా పంజాబ్‌లోని ఆప్ సర్కారు.. ఆంధ్రప్రదేశ్‌‌ను స్ఫూర్తిగా తీసుకుని ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. పంజాబ్ సర్కారు ‘ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన’ పేరుతో లబ్ధిదారుల ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసే విధానాలను రూపొందిస్తున్నట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రకటించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ప్రజల చెంతకే పాలనలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఇంటింటికే రేషన్ పంపిణీ వ్యవస్థను తీసుకువచ్చింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్ పంపిణీకి ప్రత్యేక వాహనాలు సిద్ధం చేసి.. వాటికి డ్రైవర్లను కేటాయించి ‘ఇంటి వద్దకే రేషన్‌’ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో ప్రజలు రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి.. క్యూ లైన్‌లో గంటల తరబడి నిల్చొని రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 530 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి.. 9,260 మొబైల్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వాహనాలతో గతేడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తోంది. ఈ విధానం ఏపీలో విజయవంతంగా కొనసాగుతోంది.

ఆప్‌ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ పథకాన్ని పంజాబ్ కంటే ముందే ఢిల్లీలో ప్రవేశపెట్టాలని చూశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అడ్డంకుల కారణంగా ఢిల్లీలో కార్యరూపం దాల్చలేదు. తాజాగా పంజాబ్‌లో ఆప్ సర్కారు ఏర్పడడంతో.. అక్కడ ఇంటింటి రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రజలు రేషన్ పొందడానికి ఒక రోజు సమయం వెచ్చించాల్సి వస్తోందని.. వృద్ధులు కిలోమీటర్లు నడచి రేషన్ తెచ్చుకుంటున్నారని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ అన్నారు. ఇక నుంచి పంజాబ్‌లో ఈ కష్టాలకు చెక్ పెడతామని.. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానం రూపొందిస్తామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.