యాప్నగరం

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కొత్త మెలిక.. అదే జరిగితే వైసీపీకి ఇబ్బందే!

ఏపీలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం చెబుతోంది. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమంటోంది.

Samayam Telugu 18 Nov 2020, 6:39 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు.. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu చంద్రబాబు


గతంలో వేసిన నామినేషన్లతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని.. గతంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను బెదిరించి, తప్పుడు కేసులు పెట్టి బలవంతంగా ఉపసంహరింపజేశారని ఆరోపించారు. అందుకే ఈసారి కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ మెజార్టీ పార్టీలు ఇదే అభిప్రాయం చెప్పాయని గుర్తు చేశారు. మంగళవారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలి అన్నారు. ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులకు అడ్డుకట్ట వేసేందుకు అక్కడి నుంచే నాంది పలకాలని.. గెలుపే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.