యాప్నగరం

నరేంద్ర మోదీతో వ్యక్తిగత విరోధం లేదు.. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Narendra Modi| నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. మోదీతో వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం లేదన్న బాబు.. రాష్ట్రం కోసమే పోరాటం చేశామన్న టీడీపీ అధినేత.

Samayam Telugu 11 Oct 2019, 11:16 pm
నరేంద్ర మోదీతో తనకు ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదంటున్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని పోరాటం చేశామని గుర్తు చేశారు. రాష్ట్రం, అభివృద్ధి కోసమే టీడీపీ మొదటి నుంచి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాజా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu cbn


వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ నాలుగు నెలల్లో అమరావతిని జగన్‌ ముంచేశారన్నారు బాబు. సీఎం అసమర్థతతో రాష్ట్రాభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని.. గత ఐదేళ్లలో రాని విద్యుత్ కొరత ఇప్పుడు వచ్చిందన్నారు. ఇప్పుడు విద్యుత్ ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని.. ప్రభుత్వం అసమర్థత వల్లే కరెంటు కోతలని విమర్శించారు. శ్మశానాలకు కూడా వైసీపీ రంగులు వేస్తున్నారని.. అలాగే వారి ముఖాలకూ వైసీపీ రంగులు వేసుకుంటే బావుంటుందంటూ సెటైర్లు పేల్చారు. మందుబాబుల వద్ద కూడా జే-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇక నదుల అనుసంధానం ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించిన విషయం కాదని గమనిస్తే మంచిదన్నారు చంద్రబాబు. ఈ అంశం రెండు రాష్ట్రాలకు సంబంధించినదని.. ప్రజలకు దీనిపై చైతన్యం రావాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి టీడీపీ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. ఇక ప్రతిపక్షాన్ని అణగదొక్కేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని.. వారి ఆటలు సాగినివ్వబోమన్నారు. పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.