యాప్నగరం

GMC Balayogi: బాలయోగి జయంతి.. చంద్రబాబు భావోద్వేగం

దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన సేవలను స్మరించుకున్నారు. బాలయోగి తనకు అత్యంత ఆత్మీయుడన్నారు.

Samayam Telugu 1 Oct 2019, 9:10 am
దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సేవలను సర్మించుకున్నారు. సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి స్పీకర్ స్థాయికి ఎదిగారని కొనియాడారు. బాలయోగి తనకు అత్యంత ఆత్మీయుడన్న చంద్రబాబు.. కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపిందన్నారు.
Samayam Telugu balayogi


బాలయోగి జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ట్విట్ చేశారు. ‘‘కోనసీమలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, అంచెలంచెలుగా ఎదిగి లోక్ సభ స్పీకర్ గా ఆ పదవికే వన్నెతెచ్చిన నాయకుడు, బడుగు బలహీన వర్గాల బంధువు, స్వర్గీయ గంటి మోహన చంద్ర బాలయోగిగారి జయంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నాన’’ని ఆయన ట్వీట్ చేశారు.
నారా లోకేశ్‌ మంగళవారం కోనసీమలో పర్యటించనున్నారు. అమలాపురంలో జీఎంసీ బాలయోగి జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రావులపాలెం మీదుగా భారీ ర్యాలీగా కొత్తపేట, పలివెల, ముక్కామల, అంబాజీపేట, బండారులంక మీదుగా ఆయన అమలాపురం చేరుకుంటారు. నల్లవంతెన వద్ద ఉన్న బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తారు. అనంతరం మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పుట్టినరోజు వేడుకల్లో లోకేశ్ పాల్గొంటారు.

బాలయోగి నేపథ్యం ఇదీ..
జీఎంసీ బాలయోగి 1945 అక్టోబర్ 1న కోనసీమ ప్రాంతంలో దళిత రైతు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ, లా చదివారు. 1991లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996-98 మధ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 1998 మార్చి 24న లోక్ సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆ పదవిలో ఉండగానే 2002, మార్చి 3న భీమవరం నుండి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం కారణంగా కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామం సమీపంలో ఆయన ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ కొబ్బరి చెట్టుకు తగిలి చేపల చెరువులో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.