యాప్నగరం

తిరుపతి ఉపఎన్నిక వార్: కేంద్ర మాజీ మంత్రిని దించిన చంద్రబాబు.. హోరాహోరీ పక్కా!

Chandrababu Naidu: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు తన అభ్యర్థిని ప్రకటించారు.

Samayam Telugu 16 Nov 2020, 7:38 pm
చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ స్థానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికకు తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా నిర్ణయించినట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
Samayam Telugu చంద్రబాబు


ఈ సమీక్షలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభకు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన పనబాక లక్ష్మినే మళ్లీ అభ్యర్థిగా నిర్ణయించినట్లు చంద్రబాబు నేతలతో చెప్పారు. అభ్యర్థి విజయం కోసం శ్రేణులంతా కష్టపడి పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
వైసీపీకి చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికను ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. తిరుపతిలో కూడా గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవలే ఏపీ బీజేపీ అగ్రనేతలు తిరుపతిలో మంతనాలు కూడా జరిపారు. ఈ తరుణంలోనే అందరి కంటే ముందుగా చంద్రబాబు వ్యూహాత్మకంగా అభ్యర్థిని ప్రకటించేశారు. దీంతో తిరుపతిలో అప్పుడే ఎన్నికల సందడి నెలకొంది.

పనబాక లక్ష్మి గతంలో తిరుపతి నుంచి పోటీ చేసిన అభ్యర్థి కావడం టీడీపీ లాభించే అంశం. అయితే వైసీపీ తరఫున ఎవరు బరిలో దిగుతారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇంత వరకు బల్లి దుర్గాప్రసాద్ కుటుంబీలకులు సమావేశం కాకపోవడంతో తిరుపతి నుంచి ఎవరు బరిలో దిగుతారనే దానిపై వైసీపీలో గందరగోళం నెలకొంది. టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో త్వరలోనే వైసీపీ సైతం తన క్యాండెట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. 2019లో పనబాక లక్ష్మిపై బల్లి దుర్గాప్రసాద్ 2 లక్షలకు పైచిలుకు మెజారిటీతో సునాయాసంగా గెలిచారు. అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా మళ్లీ ఆర్థికంగా బలంగా ఉన్న పనబాక లక్ష్మిని బరిలో దించారు. దీంతో వైసీపీ అభ్యర్థి ఎవరైనా ఈ సారి ఉప ఎన్నికలో హోరాహోరీ తప్పదని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.