యాప్నగరం

రంగంలోకి ప్రెస్ కౌన్సిల్.. జగన్‌ సర్కార్‌కి చెంపపెట్టన్న చంద్రబాబు

మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేసులు పెట్టే అధికారాలను ప్రభుత్వ శాఖల అధికారులకు కట్టబెడుతూ జగన్ ప్రభుత్వం జీవో తెచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంది.

Samayam Telugu 2 Nov 2019, 11:43 pm
నిరాధార కథనాలను ప్రచురిస్తే కేసులు పెట్టేందుకు వీలుగా జగన్ సర్కార్ జీవో నంబర్ 2430 తీసుకొచ్చింది. ఆధారాలు లేని వార్తలు ప్రసారం చేస్తే ఆయా ప్రభుత్వ శాఖల అధిపతులు మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేసులు పెట్టే అధికారాలను కట్టబెట్టింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన జీవోను సవరిస్తూ మరో జీవో విడుదల చేసింది. అయితే ఈ జీవోపై ఏపీలో రాజకీయ దుమారమే రేగింది.
Samayam Telugu 10VJPG7-NCHANDRABABUNAIDU


పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారంటూ జర్నలిస్టు సంఘాలు, విపక్షాలు గొంతెత్తాయి. విషయం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) దృష్టికి వెళ్లడంతో ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు స్వీకరించింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. పీసీఐ సుమోటోగా స్పందించడంపై జర్నలిస్టు సంఘాలు, విపక్ష నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ కౌన్సిల్ నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

Also Read: అమరావతికి భారత్‌లో చోటు లేదు.. ఏపీ రాజధానిపై కొత్త వివాదం
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం జగన్ సర్కార్‌కి చెంపపెట్టని ట్వీట్ చేశారు. నిజాలు నిర్భయంగా వెల్లడించే జర్నలిస్టులను వేధించేందుకే ఈ జీవో తెచ్చారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించే సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకునే వరకూ అన్ని విధాలుగా పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏపీలో రెండు చానళ్ల ప్రసారాలు నిలిపివేస్తే టీడీశాట్ మందలించి రోజుకి రూ.2 లక్షలు ఫైన్ వేసినా జగన్ ప్రభుత్వానికి బుద్ధిరాలేదని మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఇప్పుడు చీకటి జీవో 2430పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా కేసు నమోదు చేసిందన్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అన్న నానుడిని గుర్తు చేశారు. మొట్టికాయలు పడేదాకా వీళ్లకి కళ్లు తెరుచుకోంటూ సెటైర్లు వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.