యాప్నగరం

నెత్తిన బొచ్చె, చేతిలో ప్లకార్డుతో లోకేశ్ నిరసన, ఫొటో మార్పింగ్‌తో వైఎస్ఆర్సీపీ ఎగతాళి!

AP Sand Issue | టీడీపీ ప్రధాన కార్యదర్శి తొలిసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు దిగారు. నెత్తి మీద బొచ్చె, చేతిలో ప్లకార్డుతో మంగళగిరిలో ఆయన రొడ్డెక్కారు. కాగా వైఎస్ఆర్సీపీ ఆయన్ను ట్రోల్ చేసింది.

Samayam Telugu 30 Aug 2019, 1:43 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి (ఆగస్టు 30) నాటికి సరిగ్గా 3 నెలలు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్ష టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు దిగింది. ప్రభుత్వమే ఇసుక కొరత సృష్టించిందని ఆరోపిస్తూ.. టీడీపీ నేతలు రోడ్లెక్కారు. ఈ వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. ఇప్పటి వరకూ ప్రతిపక్ష నేతగా ఆయన బయటకు రాలేదు.
Samayam Telugu lokesh sand protest


ఇసుక కొరత పట్ల ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. నారా లోకేశ్ తొలిసారి జనంలోకి వచ్చారు. మంగళగరిలో నెత్తి మీద ఇసుక ఎత్తే బొచ్చె పెట్టుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు. భారతీ సిమెంట్ బస్తా రూ. 360, భారతీ ఇసుక బస్తా రూ.400 అంటూ చేతిలో ప్లకార్డు పట్టుకొని ఆయన నిరసన వ్యక్తం చేశారు.
తుగ్లక్ పరిపాలన గురించి గతంలో విన్నాం.. ఇప్పుడు జగన్ రూపంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని లోకేశ్ సెటైర్లు వేశారు. ఇసుక కొరత వల్ల కార్మికులందరూ పనుల్లేక రోడ్డున పడ్డారన్న లోకేశ్... ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మికుడికీ ప్రభుత్వం రూ. 60 వేల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇసుకాసుర జగన్మోహనా, పేదల పాలిట భస్మాసురా అనే ప్లకార్డు పట్టుకొని లోకేశ్ నిరసన వ్యక్తం చేశారు. కానీ ఈ ఫొటోను మార్ఫింగ్ చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు.. భష్మాసురా కాదు.. భస్మాసురా అని రాయాలంటూ టీడీపీ నేతను ట్రోల్ చేశారు. ఈ విషయమై లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఇసుక లేక పనుల్లేక పేదలు అల్లాడుతుంటే పట్టించుకోని జగన్.. పేదలకు అండగా నిలబడి టీడీపీ చేస్తున్న పోరాటాన్ని అపహాస్యం చేసి పక్కదారి పట్టించడానికి సోషల్ మీడియా అడ్డంపెట్టుకుని ఇలా నీచప్రచారానికి దిగుతారా? అని ఆయన మండిపడ్డారు. మీ మార్ఫింగ్ కుట్రలతో ప్రజల బాధల్ని ఎగతాళి చేస్తారా? అని లోకేశ్ ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.