యాప్నగరం

వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన రోజులొచ్చాయ్: అశోక్ గజపతిరాజు

వైసీపీ సర్కారుపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన రోజులు వచ్చాయన్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 13 Sep 2022, 3:24 pm
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన రోజులు వచ్చాయని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. గత మూడేళ్ల వైసీపీ పాలనలో ఎక్కడా ఒక్క ఇంటి నిర్మాణం జరగలేదని దుయ్యబట్టారు. ఇప్పటికే పన్నులు విపరీతంగా పెంచారని.. కొత్త రకాల పన్నులను కూడా ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు. చెత్త పన్ను కట్టకపోతే రేషన్‌తో పాటు పెన్షన్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో అసలు రేషన్ ఇస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
Samayam Telugu అశోక్ గజపతి రాజు (ఫైల్ ఫొటో)


ఈ మేరకు మంగళవారం అశోక్ గజపతి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయో లేవో తెలియడం లేదని.. కేంద్ర ప్రభుత్వం అందించిన కోవిడ్ డబ్బుల్ని సైతం దారి మళ్లించారని అశోక్ గజపతి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో ఒక్క ఇన్‌స్టిట్యూట్ కూడా ప్రారంభం కాలేదన్నారు.

ఇక, రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతులు 33 వేల ఎకరాలు త్యాగం చేస్తే, వాటిని నాశనం చేశారని అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం రైతుల నుంచి భూమి తీసుకొని, వ్యాపారం చేయాలని చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేసి, ఎన్నో ఉద్యోగాలు కల్పించారని.. అలాంటి ప్రణాళికలు ఏపీలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పక్కన పెట్టేశారని, నిధులు ఏమవుతున్నాయో అర్థం కావట్లేదని అశోక్ గజపతిరాజు తెలిపారు. ఏ అంశం మీదపై అయినా రాజ్యాంగబద్ధంగా చర్చ జరగాల్సి ఉంటుందని.. కానీ, ఈ ప్రభుత్వం చర్చించడానికి అవకాశమే ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. మూడు రాజధానులు తెస్తామని చెప్తోన్న ఈ ప్రభుత్వం.. విశాఖపట్నంలోని అన్ని ఐటీ కంపెనీలను నాశనం చేసి, వెనక్కు పంపించేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అసలు ఉద్యోగ అవకాశాలే లేకుండా చేశారని విమర్శించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.