యాప్నగరం

‘జగన్.. ఆలయ సంప్రదాయాలు పట్టవా? ’

దుర్గ గుడి సంప్రదాయాలను పక్కనబెడతారా? జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. రాష్ట్రంలో రావణ పాలనకు ఇది నిదర్శనమని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 5 Oct 2019, 1:40 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. దైవకార్యాల్లో పురాతనంగా వస్తున్న సంప్రదాయాలను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మకు మూలా నక్షత్రం రోజు పట్టువస్త్రాలు ఇవ్వాల్సి ఉందని ఉమా తెలిపారు.
Samayam Telugu uma.


దుర్గ గుడి సంప్రదాయాలకు విరుద్ధంగా ముందురోజే అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడమేంటని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ పర్యటన ఉందని సంప్రదాయాలను పక్కనబెట్టి ముందురోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడమేంటని ఉమా ప్రశ్నించారు. రాష్ట్రంలో రావణ పాలనకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Also Read: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

జలాశయాల్లో నీరు నిల్వ ఉంచే అవకాశం ఉన్నా అసమర్థతతో సముద్రం పాలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం డ్యాం ఎత్తు తగ్గింపునకు కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. పోలవరంలో తక్కువకు టెండర్లు వేస్తేనే బిల్లులు చెల్లిస్తామంటూ బెదిరిస్తున్నారని దేవినేని ఆరోపించారు.

Read Also: అమ్మవారిని ఆ కోరిక కోరా.. ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

పాలనలోనే జగన్ వివక్ష చూపుతున్నారని ఉమా ఆరోపించారు. చంద్రబాబు కార్యాలయంలో పనిచేసిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వడం లేదని, వారిని రిలీవ్ చేయకుండా వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. ఆయన కుల వివక్ష చూసి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ ఓ మహిళా ఎంపీడీవో రోడ్డెక్కి నిరసనకు దిగినా పోలీసులు పట్టించుకోరా? అని నిలదీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.