యాప్నగరం

‘ఇంట్లో బాత్రూమ్‌కి రూ.48 లక్షలు.. ఇదీ జగన్ నిర్వాకం!’

ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు చంద్రబాబు పది కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మంత్రి పేర్ని నాని అబద్ధాలు చెబుతున్నారని, దమ్ముంటే నిరూపించాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సవాల్ విసిరారు.

Samayam Telugu 25 Oct 2019, 7:00 pm
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు రూ.10 కోట్లు ఖర్చు చేశారంటూ ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర స్థాయితో ధ్వజమెత్తారు. జగన్ క్యాబినెట్ మంత్రులు అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఢిల్లీ దీక్షకు చంద్రబాబు రూ.10 కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నారని.. కానీ కేవలం కోటి అరవై లక్షలు మాత్రమే ఖర్చయిందన్నారు. నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Samayam Telugu cm camp office


ఆర్థిక శాఖ అధికారుల వద్దకు స్వయంగా వెళ్దాం.. పది కోట్లు ఖర్చు చేసినట్లు నిరూపించగలరా అని రామయ్య నిలదీశారు. ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికెళ్లి తేల్చుకుందామంటూ మంత్రి పేర్ని నానికి సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కావాలనే చంద్రబాబుపై బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.

Read Also: పాపం కేఏ పాల్.. పవన్ ముదురు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ కేవలం రూపాయికే పని చేస్తున్నానని చెబుతారని.. కానీ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కి రూ.15 కోట్లు ఖర్చు చేశారని వర్ల ఆరోపించారు. కేవలం బాత్రూమ్‌లకి రూ.48 లక్షలు ఖర్చు చేశారన్నారు. పేరుకే రూపాయి జీతం అంటారని, రూ.15 కోట్లు ఇంటికి ఖర్చు చేశారన్నారు. ఆయన ఉండేది ప్రభుత్వ భవనం కూడా కాదని, సొంత భవనానికి అన్ని నిధులు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.

Also Read: సుజనాతో మరో టీడీపీ ఎమ్మెల్యే భేటీ.. తమ్ముళ్లలో గుబులు..

ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ రాజమహల్ కాదని.. ఆ తరువాత ముఖ్యమంత్రులకు ఆ భవనాన్ని అప్పగిస్తారా అని రామయ్య ప్రశ్నించారు. సొంత భవనానికి ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారని ఆయన నిలదీశారు. సొంత కేసుల్లో జగన్‌ కోర్టుకు హాజరయ్యేందుకు ప్రతివారం ప్రజాధనం నుంచి రూ.60 లక్షలు ఎలా ఖర్చు చేస్తారని నిలదీశారు. జగన్‌కి నైతిక విలువలుంటే ఆ ఖర్చులన్నీ వ్యక్తిగతంగానే భరించాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.