యాప్నగరం

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ

స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామిని బాల.

Samayam Telugu 18 Mar 2020, 4:35 pm
స్థానిక సంస్థల ఎన్నికలవేళ టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇద్దరికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. వారితో పాటూ మరికొందరు అనుచరులు కూడా వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Samayam Telugu atp.


శమంతకమణి, యామిని బాల కొద్ది రోజులుగా అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తమ నియోజకవర్గంలో కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహంగా ఉన్ననట్లు తెలుస్తోంది. అంతేకాదు స్థానికంగా జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు కూడా వీరు దూరంగా ఉంటున్నారట. శమంతకమణి ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాలకు హాజరుకాలేదు. అయితే అనారోగ్య కారణంతోనే రాలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

శమంతకమణి టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఓసారి శింగనమల ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలో ముఖ్యనేతగా ఉన్నారు. అందుకే చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2014లో ఆమె కుమార్తె యామిని బాలకు ఎమ్మెల్యేగా చంద్రబాబు అవకాశం కల్పించారు. కానీ 2019నాటికి సీన్ మొత్తం మారిపోయింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జిల్లా నేతల సలహాతో శింగనమల నియోజకవర్గ అభ్యర్థిని మార్చేశారు. యామిని బాల బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు. ఆమె వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల తర్వాత బండారు శ్రావణి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆమె యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో ఈ ఇద్దరు నేతలు పార్టీకి కాస్త దూరంగా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.