యాప్నగరం

‘పారాసిట్మాల్, చేతులు కడుక్కోవడం చాలా.. మరి లాక్‌డౌన్‌లు ఎందుకు నాయనా..’

YS Jagan: పరిశుభ్రంగా ఉండటం ద్వారా కరోనా వైరస్‌ను నివారించవచ్చంటూ సీఎంవో అడిషనల్‌ సీఎస్‌ పీవీ రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Samayam Telugu 24 Mar 2020, 9:12 pm
రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైసీపీ సర్కారు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రతిపక్ష టీడీపీ నాయకుల నుంచి విమర్శల పర్వం ఆగడం లేదు. కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వ అధికారుల మాటలను లక్ష్యంగా చేసుకుని మండిపడ్డారు. ఇందులో భాగంగానే టీడీపీ ఎంపీ కేశినేని నాని తన విమర్శలకు పదునుపెంచారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించడం ద్వారా, ప్రతి గంటకొకసారి చేతులు కడుక్కోవడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని సీఎంవో అడిషనల్‌ సీఎస్‌ పీవీ రమేష్‌ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ నాని కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు.
Samayam Telugu 1


‘‘మొన్న పారాసిట్మాల్ 650 గ్రాములు 6 గంటలకోసారి వేసుకోమని సలహా ఇచ్చావు. ఇప్పుడేమో గంటకోసారి చేతులు కడుక్కుంటే చాలంటున్నావు. మరి ఈ లాక్ డౌన్‌లు, జనతా కర్ఫ్యూలు, ఇంత హంగామా ఎందుకు నాయనా? జగన్ గారూ ,ఈయన్ని ఇటలీకి సలహాదారుగా పంపాలి.’’ అంటూ పీవీ రమేష్‌ను ఎద్దేవా చేశారు.

అలాగే విజయవాడ మున్సిపల్ సిబ్బంది రోడ్ల పక్కన ఉన్న పేదలకు భోజనం పంపిణీ చేస్తున్న వీడియోను రీట్వీట్ చేసిన ఎంపీ నాని అన్నా క్యాంటీన్లను మూసివేయడంపై విమర్శలు గుప్పించారు. ‘‘ముందూ వెనుక ఆలోచించకుండా అన్నా క్యాంటీన్లు మూసివేశారు. ఈ పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్లు ఉండుంటే పేదలకు ఈ దుస్థితి దాపురించేది కాదు. ఆత్మగౌరవానికి భంగం కలగకుండా నాణ్యమైన భోజనం వారికి లభించేది. పాలకులు ఒక చిన్న పని చేసినా దాని వల్ల వచ్చే పరిణామాలు వంద సార్లు బేరీజు వేసుకొని చేయాలి’’ అంటూ వైసీపీ ప్రభుత్వానికి చురకలంటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.