యాప్నగరం

అమ్మకానికి టీటీడీ ఆస్తులు.. క్లారిటీ ఇచ్చిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాలు ఆస్తుల విక్రయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ 50 ఆస్తులు దేవ‌స్థానానికి ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌నివేనని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 23 May 2020, 11:22 pm
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాలు (టీటీడీ) ఆంధ్రప్రదేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో బ‌హిరంగ వేలం ద్వారా విక్రయించడానికి నిర్ణయం తీసుకున్న 50 ఆస్తులు దేవ‌స్థానానికి ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌నివేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కొన్ని టీవీ చానళ్లలో ఈ విష‌యానికి సంబంధించి అవాస్తవ స‌మాచారంతో భ‌క్తుల్లో గంద‌ర‌గోళం ఏర్పడిందని, అయితే వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu తిరుమల ఆలయం, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి


జీవో ఎంఎస్ నంబర్ 311 రెవెన్యూ (ఎండోమెంట్స్ -1), తేదీ 09 - 04 - 1990 రూల్ -165, చాప్టర్ - 22 ద్వారా టీటీడీకి మేలు క‌లిగే అవ‌కాశం ఉంటే దేవ‌స్థానం ఆస్తుల‌ను విక్రయించ‌డం, లీజుకు ఇవ్వడం లాంటి అధికారాలు టీటీడీ బోర్డుకే ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. బోర్డు నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. దేవ‌స్థానం నిర‌ర్థక ఆస్తుల అమ్మకం ప్రక్రియ 1974 నుంచి జ‌రుగుతోందన్నారు. ఈ ర‌కంగా 2014 వ‌ర‌కు 129 ఆస్తుల‌ను బ‌హిరంగ వేల‌ం ద్వారా విక్రయించినట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చ‌ద‌ల‌వాడ కృష్ణమూర్తి అధ్యక్షులుగా ఉన్న టీటీడీ పాల‌క‌మండ‌లి తీర్మానం నంబ‌రు 84 తేదీ 28-07-2015 మేర‌కు టీటీడీకి ఏ ర‌కంగా ఉప‌యోగ‌ప‌‌డ‌ని ఆస్తుల‌ను గుర్తించి బ‌హిరంగ వేల‌ం ద్వారా వాటిని విక్రయించ‌డానికి గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలించ‌డానికి ఒక స‌బ్ క‌మిటీని నియ‌మించినట్లు చైర్మన్ వివరించారు.

Also Read: అమ్మకానికి టీటీడీ ఆస్తులు.. భారీగా స్థిరాస్తుల వేలం!

ఈ స‌బ్ క‌మిటీలో అప్పటి పాల‌క మండ‌లి స‌భ్యులు జి.భాను ప్రకాష్‌రెడ్డి, జె.శేఖ‌ర్‌, డీపీ అనంత, ఎల్లా సుచ‌రిత, సండ్ర వెంక‌ట వీర‌య్యను స‌భ్యులుగా నియ‌మించారని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. అప్పటి స‌బ్ క‌మిటీ నివేదిక మేరకు, అప్పటి తీర్మానం నంబర్ 253 తేదీ 30-01-2016 ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో స‌బ్ క‌మిటీ గుర్తించిన 50 నిర‌ర్థక ఆస్తుల‌ను బ‌హిరంగ వేల‌ము ద్వారా విక్రయించ‌డానికి చ‌ద‌ల‌వాడ కృష్ణమూర్తి ఆధ్యక్షత‌న గల పాలక మండ‌లి ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

ఈ తీర్మానం మేర‌కు దేవ‌స్థానం సిబ్బంది ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో గ‌ల 17 ఆస్తులు, ప‌ట్టణ ప్రాంతాల్లోని 9 ఆస్తులు, త‌మిళ‌నాడు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల‌లో ఉన్న 23 ఆస్తులకు సంబంధించి స‌బ్‌రిజిస్ట్రార్ కార్యాల‌యాల రికార్డుల్లోని విలువ, బ‌హిరంగ మార్కెట్ విలువ‌ల‌ను సేక‌రించి పాల‌క‌మండ‌లికి నివేదించినట్లు వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ఒక ఆస్తికి సంబంధించి కోర్టు కేసు ఉండ‌టంతో వేలం ప్రక్రియ నుంచి మినహాయించినట్లు పేర్కొన్నారు. అలాగే రుషికేష్‌లో ఎక‌రా 20 సెంట్ల భూమి వ‌ల్ల టీటీడీకి ఎలాంటి ఉప‌యోగం లేకుండా దురాక్రమ‌ణ‌కు గుర‌య్యే ప్రమాదం ఉండ‌టంతో దీన్ని కూడా వేలం జాబితాలో చేర్చినట్లు చెప్పారు.

Also Read: ఏపీలో హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ఆ తీర్మానం మేర‌కు 50 నిర‌ర్థక ఆస్తుల విలువ‌ను రూ. 23.92 కోట్లుగా ప్రస్తుత పాల‌క మండ‌లి తీర్మానం నెం.309 తేదీ 29-02-2020 ద్వారా ధ‌ర నిర్ణయిస్తూ గ‌త పాల‌క మండ‌లి నిర్ణయాల‌ను అమ‌లు చేయ‌డానికి ఆమోదం మాత్రమే తెలపినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ ఆస్తులు దేవ‌‌స్థానానికి ఏ విధంగాను ఉప‌యోగ‌ప‌డేవి కాదన్నారు. సదరు నిరర్థక ఆస్తులు 1 నుంచి 5 సెంట్ల లోపు ఉన్న ఖాళీ ఇంటి స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములుగా ఉన్నాయన్నారు. వీటివల్ల దేవస్థానానికి ఎలాంటి ఆదాయం లేకపోగా, ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉన్నందువల్ల ఈ ఆస్తుల‌ను బ‌హిరంగ వేల‌ము ద్వారా విక్రయించాల‌ని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే కొన్ని ప్రసార సాధ‌నాలు టీటీడీ ఆస్తుల వేలం విక్రయానికి సంబంధించి గత పాలక మండలి తీసుకున్న, పై కమిటీలు తీసుకున్న నిర్ణయాలకు, ప్రభుత్వానికి లింకు పెట్టడం స‌రికాదని వైవీ చెప్పారు. వాస్తవాలు ఇలా ఉండగా కొన్ని ప్రసార సాధనాలు అవాస్తవ సమాచారంతో కథనాలు ప్రసారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం సరికాదని సుబ్బారెడ్డి హితవు పలికారు.

Also Read: తిరుమల శ్రీవారి లడ్డూలు: ఆ 3 జిల్లాలకు 1.10 లక్షలు.. కావాలంటే ఇలా చేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.