యాప్నగరం

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి తీరుతాం.. టార్గెట్ రూ. 1.75 లక్షల కోట్లు.. కేంద్రం సంచలన ప్రకటన!

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించి తీరుతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Samayam Telugu 15 Mar 2021, 8:28 pm
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకొని 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టినట్టు పేర్కొన్నారు.
Samayam Telugu విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ప్రకటన


ప్రైవేటీకరణకు లాభ నష్టాలు కొలమానం కాదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ద్వారా సమకూరిన వనరులను వివిధ సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష వ్యయాలు, అప్పులపై అధిక వడ్డీలు, తక్కువ ఉత్పాదకత, వినియోగ సామర్థ్యమే ప్రధాన కారణాలని వివరించారు.

కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు, ఆర్థిక సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, మైనార్టీ వాటాల విక్రయం ద్వారా 2021-22లో రూ. 1.75 లక్ష కోట్ల ఆదాయం ఆర్జించాలని ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల ఉత్పాదకతను పెంచి వాటి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమే ప్రైవేటీకరణ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్రైవేటీకరణతో వచ్చే వనరులను వివిధ సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నందు వల్ల ప్రజలు ప్రయోజనం పొందుతారన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. అయితే, కేంద్రం పట్టువిడుపు లేకుండా ముందుకు వెళుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అని నినదిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ విషయంలో దూకుడుగా ముందుకెళ్తోంది. విశాఖ ఉక్కు ఉద్యమానికి రాజకీయ, సినీ ప్రముఖులు ఇప్పటికే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.