యాప్నగరం

Andhra కు బిగ్ షాక్: తేల్చేసిన కేంద్రం.. సంచలన ప్రకటన!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.

Samayam Telugu 6 Dec 2021, 8:02 pm
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందోనని ఎదురుచూసే రైతాంగానికి ఊహించని షాకిచ్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా సోమవారం మోదీ సర్కార్ తేల్చిచెప్పింది. సోమవారం రాజ్యసభలో తెలుగు దేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించారు. ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Samayam Telugu ప్రధాని మోదీతో సీఎం జగన్ (ఫైల్ ఫొటో)


2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యంతో పాటు కరోనా కారణంగా పోలవరం నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరిగిందని ప్రకటించారు. స్పిల్ వే చానల్ పనులు 88 శాతం పూర్తవగా, ఎప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 73 శాతం, పైలెట్ చానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర జలశక్తివనరుల సహాయ మంత్రి తెలిపారు.

అయితే, పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548.87 కోట్లకు టీఏసీ ఆమోదించిన మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి వెల్లడించారు. అయితే 2020 మార్చిలో సవరించిన అంచనాలపై ఆర్‌సీసీ నివేదిక ఇచ్చిందని, దాని ప్రకారం రూ.35,950.16 కోట్లకు మాత్రమే కేంద్రం అంగీకారం తెలిపిందని బిశ్వేశ్వర తుడు తన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. కాగా, డిసెంబర్ 1 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని జగన్ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 2022లో సైతం పోలవరం నిర్మాణం పూర్తి కాబోదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, అందరికీ షాకిచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.