యాప్నగరం

ఏపీకి ప్రత్యేక హోదాపై.. మోదీ సర్కార్ కీలక ప్రకటన.. కుండబద్దలు కొట్టేసింది!

ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి మోదీ సర్కారు కీలక ప్రకటన చేసింది. మరోసారి కుండబద్దలు కొట్టేసింది.

Samayam Telugu 30 Nov 2021, 5:08 pm
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి విస్పష్టంగా ప్రకటన చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని మోదీ సర్కార్ తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Samayam Telugu ప్రత్యేక హోదాపై కేంద్రం కీలక ప్రకటన


‘‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నాం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయింది.

కాబట్టి 2015- 16 నుంచి 2019- 20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాలను 90: 10 నిష్పత్తి కింద వచ్చే మొత్తాన్ని ప్రత్యేక సాయంగా ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించాం. 2015- 16 నుంచి 2019- 20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.’’ అని నిత్యానందరాయ్‌ పేర్కొన్నారు.

మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మరోసారి లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రత్యేక సాయం చేయడానికి మాత్రం అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది. విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మిగిలిన వాటికి కొంత సమయం ఉందని కేంద్ర హోం శాఖ పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.