యాప్నగరం

తెలంగాణ యువతి ఆంధ్రాలో మూడంతస్తుల భవనం నిర్మించి.. అందులోనే ఆత్మహత్య.. ఆర్థిక సమస్యలే కారణమా!

బాపట్ల జిల్లాలో ఓ మహిళా బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతి.. స్థానిక బలన్మరణానికి పాల్పడటం చర్చనీయాంశమైంది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 23 May 2022, 7:41 am
బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. చెరుకుపల్లి ఎస్సై డి.వెంకటకొండారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం, మట్లాపూడిలోని ఇండియన్‌ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసేవారు. ఐదేళ్లుగా ఆమె నగరం, అక్కడి నుంచి మట్లపూడి ఇండియన్‌ బ్యాంక్‌ శాఖల్లో పనిచేస్తూ బ్యాంకు నుంచి రూ. 40 లక్షల రుణం తీసుకున్నారు.
Samayam Telugu ఆత్మహత్యకు పాల్పడ్డ దివ్యవాణి


తీసుకున్న డబ్బుతో గుళ్లపల్లిలో మూడంతస్తుల భవనం నిర్మించుకుని ఉప్పాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. అందులోనే ఒక గదిలో ఆమె నివసించేవారు. బ్యాంకులో పని ఒత్తిడి కారణంగా ఇబ్బందిగా ఉంటోందని ఇటీవలే ఇంటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు చెప్పగా.. వారు ఆమెను సముదాయించి పంపించారు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు మరింత ఇబ్బందికి గురిచేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే శనివారం విధులు ముగించుకుని బ్యాంకు నుంచి వచ్చి తన గదిలో నిద్రించారు. అయితే, ఆదివారం ఉదయం అద్దెకు ఉంటున్న శ్రీనివాసరావు గది వైపునకు రాగా, రూమ్‌లో సీలింగ్‌కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలపగా వారు ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

తల్లిదండ్రులు సాయంత్రానికి గుళ్లపల్లి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి తండ్రి లక్ష్మీనారాయణ, అన్న రామకృష్ణ ఉన్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన యువతి స్థానికంగా తన సొంత భవనంలో బలవన్మరణానికి పాల్పడటం చర్చనీయాంశమైంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.