యాప్నగరం

Sirimanothsavam: అరటి పండు బదులు ఫోన్ విసిరేసిన యువతి.. వీడియో వైరల్

Vizianagarm | 1758లో ప్రారంభమైన పైడితల్లి ఉత్సవాలను ఈ ఏడాది కూడా విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఓ మహిళ అరటి పండును విసిరేయబోయి... పొరబాటున ఫోన్‌ను విసిరేసింది.

Samayam Telugu 16 Oct 2019, 3:56 pm
ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని విజయనగరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలిసారి రాష్ట్ర పండుగగా ఈ జాతరను నిర్వహించగా.. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఏటా దసరా పండుగ తర్వాత వచ్చే మంగళవారం రోజున సిరిమానోత్సవం నిర్వహిస్తారు. 40 అడుగుల పొడవు ఉండే సిరిమాను (చింతమాను)కు ఆసనం అమర్చి.. దాని మీద అమ్మవారి ప్రతిరూపంగా పూజారిని కూర్చోబెట్టి చదురుగుడి వద్ద ఉన్న ఆలయం నుంచి కోట వరకూ మూడుసార్లు ఊరేగిస్తారు.
Samayam Telugu Sirimanothsavam


ఈ సందర్భంగా సిరిమాను ఊరేగింపు సాగిన మేరా భక్తులు అరటిపండ్లు, పూలు, ఇతర ప్రసాదాలను సిరిమాను మీదకు విసురుతారు. ఇలా చేయడం వల్ల అమ్మ దీవిస్తుందని భావిస్తారు. ఇలా అరటిపండ్లు విసిరే క్రమంలో.. ఓ మహిళ పొరబాటున అరటి పండుకు బదులుగా తన చేతిలోని ఫోన్‌ను విసిరేసింది. భవంతి పై అంతస్థు నుంచి మొబైల్ ఫోన్‌ను వేసిరేసిన సదరు మహిళ.. కాసేపట్లోనే జరిగిన తప్పిదాన్ని గ్రహించి.. నాలుక కరుచుకుంది. వెనుక నుంచి మరొకరు తీస్తున్న వీడియాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఫోన్ విసిరేసినందుకు ఆమె ఎంతగా బాధపడిందో తెలీదు.. కానీ నెటిజన్లు మాత్రం నవ్వుకుంటూనే.. పాపం అనుకుంటున్నారు.

ఇదీ చరిత్ర..
రాజకుటుంబంలో జన్మించిన పైడితల్లి విజయనగరం, బొబ్బిలి రాజ్యాల మధ్య యుద్ధంతో తల్లడిల్లింది. ఇరు రాజ్యాల రాజులూ యుద్ధంలో వీరమరణం పొందడంతో.. పైడిమాంబ పెద్దచెరువులో దూకి ఆత్మార్పణ చేసుకుంది. కొన్నాళ్లకు పతివాడ అప్పలనాయుడి కలలో కనిపించిన అమ్మ... తాను చెరువులో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పింది. దీంతో స్థానికులు అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసి.. విజయదశమి తర్వాత వచ్చిన మంగళవారం రోజున వనంగుడిలో ప్రతిష్టించారు.

అందుకే దసరా వెళ్లిన తర్వాత వచ్చే మంగళవారం నాడు సిరిమానోత్సవం నిర్వహిస్తారు. భక్తుల రద్దీ పెరగడంతో.. ఊరి మధ్యలో చదురుగుడిని నిర్మించారు. వనంగుడిని అమ్మవారి పుట్టినిల్లుగా.. చదురుగుడిని మెట్టినింటిగా భావిస్తారు.

సిరిమానోత్సవం సందర్భంగా చదురుగుడి నుంచి సిరిమాను రథం బయలుదేరుతుంది. పాలధార, అంజలి రథం, అంబారి ఏనుగు, జాలరి వల రథానికి ముందు నడుస్తాయి. చదురుగుడి నుంచి కోట వరకు సిరిమాను రథాన్ని మూడుసార్లు ఊరేగిస్తారు. విజయనగరం కోట వద్ద ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు వంశీయులను ఆశీర్వదించాక.. రథం తిరిగి గుడికి చేరుకుంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.