యాప్నగరం

ఇసుక దీక్ష వేళ.. బాబు అందుకు సిద్ధపడితే.. మరోలా షాకిచ్చిన జగన్

చంద్రబాబు ఇసుక దీక్ష వేళ.. టీడీపీ అధినేతకు వైఎస్ఆర్సీపీ ఊహించని షాకిచ్చింది. దేవినేని నెహ్రూ విషయంలో బాబు మానసికంగా సన్నద్ధమై ఉండగా.. ఊహించని రీతిలో వల్లభనేని వంశీ రూపంలో మరో బాంబు పేలింది.

Samayam Telugu 14 Nov 2019, 8:11 pm
ఏపీలో ఇసుక కొరతకు జగన్ సర్కారు వైఖరే కారణమని ఆరోపిస్తూ.. చంద్రబాబు నాయుడు విజయవాడలో గురువారం ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసం ఆయన 12 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు. బాబు దీక్షకు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఒక కారణమైతే.. పార్టీని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకోవడం రెండో కారణం. కానీ చంద్రబాబు దీక్షకు దిగిన రోజే.. సీఎం వైఎస్ జగన్ ఆయనకు ఒకటి కాదు రెండు ఝలక్‌లు ఇచ్చారు.
Samayam Telugu jaganvsbabu


దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ వైఎస్ఆర్సీపీలో చేరతారని బుధవారమే లీకులొచ్చాయి. ఇసుక దీక్ష చేస్తున్న బాబుకు షాకివ్వడం కోసం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని భావించారు. కానీ టీడీపీ అధినేత ఊహించని రీతిలో వల్లభనేని వంశీ తెర మీదకు వచ్చారు.

గురువారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన వంశీ.. తాను త్వరలోనే వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిపై, తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బాబు మారకపోతే టీడీపీ త్వరలోనే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలైనా గడవక ముందే దీక్షలేంటని నిలదీశారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియనివారు తిడితే పడాలా? అని ప్రశ్నించారు.

సరిగ్గా బాబు ఇసుక దీక్ష చేస్తున్న వేళ.. వంశీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది వైఎస్ఆర్సీపీ డైరెక్షన్లోనే జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. మొన్న పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేసినప్పుడు.. ఆ పార్టీ నేతను లాగేసుకున్నారు. ఇప్పుడు 12 గంటలు నిరాహార దీక్ష చేస్తుంటే... మా వాళ్లిద్దర్ని లాగేసుకొని మాపైనే విమర్శలు చేయిస్తారా? అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

బాబు దీక్ష చేపట్టినప్పుడే టీడీపీ నుంచి బయటకు వచ్చే వాళ్లతోనే ఆయన్ను తిట్టిస్తే.. దీక్షకు మీడియా కవరేజీ తగ్గుతుంది. జనం అటు దీక్ష వ్యవహారంతోపాటు.. ఇటు బాబుపై నాయకులు చేసిన విమర్శలను కూడా గమనిస్తారనేది జగన్ వ్యూహం కాబోలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.