యాప్నగరం

వైసీపీ వారోత్సవాలు: జగన్ సర్కారుకు ఏడాది.. పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో వారోత్సవాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

Samayam Telugu 20 May 2020, 9:24 pm
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి జీవన ప్రమాణాల్లో సమూల మార్పులు తీసుకొచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలై వైఎస్సార్‌‌సీపీ ఘన విజయం సాధించి మే 23వ తేదీకి ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు బుధవారం లేఖ రాశారు.
Samayam Telugu సీఎం జగన్

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఎన్నికల హామీలను 90 శాతం నెరవేర్చడమే కాకుండా.. మేనిఫెస్టోలో లేని మరో 40 కొత్త పథకాలను కూడా అమలు పరిచారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ సీఎంగా, మంచి మనుసున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ ప్రజల మన్ననలు పొందారని సజ్జల లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 23న అన్ని నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల‌తో పాటు మండల కేంద్రాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని, పేదలకు పండ్ల పంపిణీతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించాలని, అన్ని నియోజకవర్గాల్లో సాధించిన ప్రగతిపై వీడియోలు, ప్రకటనల రూపంలో సీఎం జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజైన మే 30వ తేదీ వరకు ప్రచారం నిర్వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏడాది పరిపాలన, ప్రగతి పథకాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని, అందుకు అనుగుణంగానే కరోనా నిబంధనలతో కార్యక్రమాలు చేయాలని సజ్జల లేఖలో సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.