యాప్నగరం

పవన్‌తో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి భేటీ.. జనసేనాని పర్యటనలో ఇదే హైలెట్!

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్‌ను వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి తండ్రి, మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య బుధవారం కలిశారు.

Samayam Telugu 3 Dec 2020, 1:02 am
నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ తరుణంలో మాజీ ఎంపీ, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి తండ్రి కేపీ రెడ్డయ్య పామర్రు వద్ద పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రెడ్డయ్య వివరించారు. ఇండియాలో రైతు అనేవాడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతులను నిర్వీర్యం చేశాయని విమర్శించారు. ఇప్పుడు కేవలం కూలీలే ఉన్నారని, రైతులు లేరని వాపోయారు. ప్రొఫెసర్లు సైతం ఎస్టిమేషన్లు తప్పుగా ఇస్తున్నారని చెప్పారు.
Samayam Telugu పవన్‌తో భేటీ అయిన కేపీ రెడ్డయ్య


ఈ సందర్భంగా రైతు కష్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని కేపీ రెడ్డయ్యను పవన్ కళ్యాణ్ కోరారు. దీనికి ఆయన అంగీకరిస్తూ, సమావేశం నిర్వహిస్తే మాట్లాడుతానని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారధి తండ్రి పవన్‌ను కలవడంతో అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పవన్‌తో కేపీ రెడ్డయ్య మాట్లాడే సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ సైతం కాస్త అసహనానికి గురయ్యారు. మొత్తానికి పవన్ పర్యటనలో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి పాల్గొని ప్రభుత్వాలను విమర్శించడం హైలెట్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రైతుల కష్టాలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదన్నారు. తుఫాను దెబ్బకి రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ప్రభుత్వాలు అంచనాలతో సరి పెట్టడమే తప్ప.. ఆదుకోవడం లేదన్నారు. రైతు సమస్యలు పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.