యాప్నగరం

ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి విజయసాయి ట్వీట్లే సాక్ష్యం.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 17 Aug 2020, 7:18 pm
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ మూర్తుల ఫోన్‌లు సైతం ట్యాపింగ్‌కు గురవుతున్నాయని, దీనికి సంబంధించి న్యాయ వ్యవస్థపై నిఘా అన్న పేరుతో పత్రికల్లో వార్తలు వచ్చాయని నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌ హోటల్లో ఏదో జరిగిందంటూ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేందుకు నిదర్శనమని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఫేస్ టైంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు మీ చుట్టూ ఉన్న అసాంఘిక శక్తులు ఎవరనేది పసిగట్టండి అని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థలను కూలదోస్తున్నారన్న అప్రతిష్ట తెచ్చుకోవద్దని హితవు పలికారు. మీ దురభిమానుల ద్వారా నాకు ఫోన్ చేయించి వేధించవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే ఈ అంశాన్ని తాను కచ్చితంగా పార్లమెంట్‌లో లేవనెత్తుతాని రఘురామ కృష్ణరాజు హెచ్చరించారు.
Samayam Telugu సీఎం జగన్, విజయసాయిరెడ్డి


అలాగే అమరావతి రైతులకు సుప్రీంకోర్టు శుభవార్త ఇచ్చిందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్‌5 జోన్‌ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించడం ఆహ్వానించదగిన పరిణామన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చీటికీమాటికీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయడం ద్వారా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద లాయర్లకు రూ. కోట్లు వెచ్చిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని తరలింపు, సీఆర్డీఏ చట్టం మార్పు అంశంపై బుధవారం జరిగే విచారణ కూడా రైతులకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు.
అలాగే ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో రాజమహేంద్రవరం పరిసరాల్లో 600 ఎకరాల భూములు ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని ఎంపీ రఘురామ ఆరోపించారు. ఆ భూములు కొనడంపై అప్పట్లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అవి ఆవ భూములు కావని అన్నారని, ప్రస్తుతం వస్తున్న గోదావరి వరదల్లో ఆ ప్రాంతమంతా మునిగిపోవడం ద్వారా అవి ఆవ భూములే అని నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఆవ భూముల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని రాజమహేంద్రవరం ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ఎకరం రూ.40 లక్షలకు కొన్న ఆవ భూములు ముంపునకు గురి కావడం ద్వారా సుమారు రూ. వందల కోట్ల ప్రజాధనం వృథా అయినట్లేనని పేర్కొన్నారు. ఆ భూముల కొనుగోలులో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కొనుగోలు, కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు కలెక్టర్‌ వద్ద నివేదికలు ఉన్నాయని, వెంటనే దోషులపై విచారణ జరిపించి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.