యాప్నగరం

చంద్రబాబు పుట్టిన నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం!

చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో మెజారిటీ స్థానాలు అధికార వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 14 Mar 2020, 11:02 pm
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు పుట్టిన, మొదట ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రగిరి నియోజకవర్గంలో 80 శాతం స్థానాలు ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది. స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోకి చేరినట్లు సమాచారం. నియోజకవర్గంలోని మొత్తం 95 ఎంపీటీసీల్లో ఇప్పటి వరకు 76 స్థానాలు ఏకగ్రీవమైనట్లు సమాచారం. మిగిలిన 19 స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణ సమయానికి ఏం జరుగుతుందనేది ఇప్పుడు నియోజకవర్గంలో ఉత్కంఠ రేపుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు వైసీపీ తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
Samayam Telugu babu sad


టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఊరు నారావారి పల్లె చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది. చంద్రబాబు ప్రస్తుతం కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. పుట్టిన గడ్డ అయిన చంద్రగిరి సైతం చంద్రబాబుకు కీలకమే. అయితే చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఇక్కడి నుండి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలుపొందారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపొందింది.

అయితే తాజాగా, తెలుగుదేశంపార్టీ నుంచి పెద్దగా పోటీ లేకపోవటంతోనే చంద్రగిరి నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాలు ఏకగ్రీవాలయ్యాయి. ఏకగ్రీవాలైన ఎంపీటీసీ స్థానాలన్నీ వైసీపీ ఖాతాలో జమ అయ్యాయి. చంద్రబాబు సొంత ఊరైన నారావారిపల్లెలో కూడా ఎన్నిక వైసీపీకి ఏకగ్రీవమైనట్లు వైసీపీ నేతలు చెబుతున్నా.. అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు హోరెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనను జనం మెచ్చారని చెప్పడానికి ఇదే నిదర్శనమి చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.