యాప్నగరం

ఓటు వేయలేదని దళితుడిని చితకబాదారు.. దళిత మంత్రి నియోజకవర్గంలోనే దారుణం..

ఎంపీటీసీ ఎన్నికల్లో తనకు ఓటేయలేదనే అక్కసుతో వైఎస్సార్ సీపీ నాయకులు దళితుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దళిత వర్గానికి చెందిన మంత్రి నియోజకవర్గంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Samayam Telugu 16 Oct 2021, 5:53 pm
అగ్రకులానికి చెందిన కొందరు దళితుడిపై దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతుంది. ఎంపీటీసీ ఎన్నికల్లో తనకు ఓటేయలేదనే అక్కసుతో వైఎస్సార్ సీపీ నాయకులు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దళిత వర్గానికి చెందిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజవర్గంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Samayam Telugu దళితుడిపై దాడి చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు


ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎక్కువ శాతం స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆ క్రమంలోనే పెద్దారవీడు మండలం మద్దలకట్ట ఎంపీటీసీ స్థానంలో టీడీపీ పోటీకి సై అనడంతో ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు.

అయితే ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేసిన మూల సత్యనారాయణరెడ్డి ఓడిపోవడానికి జార్జ్ అనే వ్యక్తే కారణమని వారు మనస్సులో పెట్టుకున్నారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి అతనిపై ఏదో విధంగా గొడవకు దిగుతూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం.. సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి ఇద్దరూ కలిసి జార్జ్‌పై దాడికి దిగారు.. మీ సామాజిక వర్గం వారు ఓటు వేయకపోవడం వల్లే తాము ఓడిపోయామంటూ విచక్షణా రహితంగా కాళ్లతో తన్నుతూ గాయపరిచారు. దాడి దృశ్యాలు చిత్రీకరిస్తున్న సుధాకర్ అనే వ్యక్తిపై కూడా దాడి చేశారు. గాయాలపాలైన ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు.

పెద్దారవీడు మండలంలో అగ్ర కులస్తులు ఇలా చేయడం కొత్తేమీ కాదు.. ఇటీవల కొత్తమెట్ల పంచాయతీ రాజుపాలెం గ్రామంలో పొలం తగాదా విషయంలోనూ అగ్ర కులస్తులు చెంచులపై దాడి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వీరిని పరామర్శించి.. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దళిత, గిరిజనులను కాపాడాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.