ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన బొమ్మి ఇజ్రాయేల్ (Bommi Israel) వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆయన ఓ కార్యక్రమంలో అమ్మాయిలతో కలిసి డ్యాన్సులు చేసిన వీడియో బయటకొచ్చింది. దీంతో ఎమ్మెల్సీపై విమర్శలు వచ్చాయి.. ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోపై ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ స్పందించారు. రెండు రోజులుగా తన పేరు మీద ఓ వీడియో వైరల్ అవుతోందని.. ఆ వీడియో చాలా పాతది అంటున్నారు. 2018, 2019లో ఇంట్లో కుటుంబ సమేతంగా జరిగిన ఫంక్షన్లో తాను డ్యాన్స్ చేశానన్నారు. కొంతమంది రాజకీయంగా ఇబ్బందిపెట్టడానికి ఆ వీడియోతో ఇప్పుడు బురదజల్లతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆ వీడియోను పట్టించుకోనని.. కానీ చాలామంది తనకు ఫోన్ చేసి అడుగుతుండటంతోనే స్పందించాల్సి వచ్చిందన్నారు.
ఈ వీడియో గతంలో కూడా కొన్ని ఛానల్స్‌లో ప్రసారమయ్యాయన్నారు ఇజ్రాయేల్. రాజకీయంగా తన భవిష్యత్ దెబ్బ తీయాలనే ఇలా చేస్తున్నారని.. అయినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కుటుంబంతో జరిగిన కార్యక్రమంలో సరదాగా డ్యాన్స్ చేశానని.. అందులో ఎలాంటి అశ్లీలత లేదన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యత ఉంది కాబట్టి క్లారిటీ ఇస్తున్నానని.. తాను ఎప్పుడూ పార్టీకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదన్నారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News