యాప్నగరం

మంత్రి పదవి రేసు నుంచి చెవిరెడ్డిని తప్పించినట్లేనా..! ఎమ్మెల్యే రోజాకు లైన్ క్లియర్..?

ఆంధ్రప్రదేశ్‌లో అందరి కళ్లు రేపు విడుదలయ్యే నూతన కేబినెట్ లిస్ట్‌పైనే ఉన్నాయి. పాత వారిలో ఎవరు కొనసాగుతారు..? కొత్త వారిలో ఎవరికి ఛాన్స్ వస్తుందోనని అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అయితే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి తుడా చైర్మన్‌గా పదవి కాలం పొడగించడంతో.. ఆయనను మంత్రివర్గ రేసు నుంచి తప్పించినట్లేనని చర్చ జరుగుతోంది.

Samayam Telugu 9 Apr 2022, 9:11 pm
ఏపీ నూతన మంత్రివర్గ కూర్పు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. రేపు మధ్యాహ్నానికి లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉండగా.. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పాత వారిలో ఎవరు కొనసాగుతారు..? కొత్త వారిలో ఎవరికి ఛాన్స్ వస్తుందోనని పార్టీ నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లా నుంచి రేసులో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించినట్లేనని ఊహగానాలు వినిపిస్తున్నాయి.
Samayam Telugu ఏపీ కేబినెట్ విస్తరణ


చిత్తూరు జిల్లా నుంచి మంత్రివర్గం రేసులో చెవిరెడ్డి, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, ఆరని శ్రీనివాసులు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తుడా చైర్మన్‌గా మరో రెండేళ్లు పదవి కాలాన్ని ప్రభుత్వం పొడగించింది. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చెవిరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన పదవి కాలాన్ని పొడగిస్తూ.. ఉత్తర్వులు వెలువడ్డాయి. సామాజిక సమీకరణాల వల్లే చెవిరెడ్డికి మంత్రి పదవి దక్కలేదని వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎంతో విధేయుడిగా ఉన్నారు.

మరోవైపు జిల్లా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయనను మంత్రివర్గంలో తీసుకోకపోతే.. అతని అనుచరుడు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మంత్రి పదవి ఇవ్వాలని పెద్దిరెడ్డి చెబుతున్నారని సమాచారం. చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయోనని రెండు జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది.

అదేవిధంగా నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవికి లైన్ క్లియర్ అయిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మహిళలను ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉందని ఈ రోజు సజ్జల చేసిన వ్యాఖ్యలతో.. మహిళా కోటాలో తనకు కేబినెట్‌లో చోటు దక్కుతుందని రోజా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎమ్మెల్యే రోజాను మంత్రి పదవి ఇస్తారో లేదా.. గతంలో లాగానే వేరే పదవి ఇచ్చి సంతృప్తి పరుస్తారో తేలాల్సి ఉంది. రేపు మధ్యాహ్నానికి కేబినెట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్‌లో ఎవరికి చోటు కల్పిస్తారో..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.