యాప్నగరం

చిత్తూరు జిల్లా ప్రజలకు అలర్ట్.. కలెక్టర్ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున నేడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలల (జూనియర్, డిగ్రీ)లకు సెలవు ప్రకటించారు.

Samayam Telugu 11 Nov 2021, 2:12 pm
చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెట్లు కొమ్మలు విరిగిపోయి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సత్యవేడు మండలం మదనంజేరి గ్రామం ఎస్సీ కాలనీలో భారీ వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేరింది. చంద్రగిరి మండలం శ్రీ తలకోన సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం సమీపంలో పురాతన చెట్టు కూలిపోయింది.
Samayam Telugu తిరుపతి


చిత్తూరు జిల్లాకు ఈ రోజు రాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. మండల, మున్సిపల్ టీంలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా జిల్లాలో సహాయక చర్యలపై సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, మండల, మునిసిపల్ టీం అధికారులతో కలెక్టర్ గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున నేడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలల (జూనియర్, డిగ్రీ)లకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రధానంగా కొన్ని గ్రామాలు కొండ ప్రాంతాలకు ఆనుకుని ఉండడంతో వర్షాకాలంలో కొండ నీరు గ్రామాలలోకి ప్రవహించే పరిస్థితి ఉంటుందన్నారు. ఎక్కడైనా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే.. ఆ ప్రాంతాలలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదుపరి ఆదేశాల వచ్చే వరకు వేచి ఉండకుండా వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు.

మండల మునిసిపల్ టీం, పోలీస్, ఫైర్ డిపార్ట్‌మెంట్లు సమన్వయంతో ఉంటూ నేడు, రేపు అప్రమత్తంగా సహాయక చర్యలను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. రహదారుల్లో చెట్లు విరిగిపడడం వంటివి జరిగినప్పుడు కాంట్రాక్టర్ల ద్వారా మెషీన్లను ఉపయోగించి తొలగించాలని సూచించారు. అలాగే డిప్యూటీ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లను అప్రమత్తంగా ఉంచాలని ఎస్ఈలకు ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.