యాప్నగరం

పవన్ వచ్చేస్తున్నారు.. జనసైనికులు, ఫ్యాన్స్‌కు పండగే

బీజేపీతో పొత్తుకు కట్టుబడి తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి రత్నప్రభ గెలుపునకు కృషి చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ అరాచక పాలనను ఎండగట్టాలంటే బీజేపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Samayam Telugu 30 Mar 2021, 7:16 am

ప్రధానాంశాలు:

  • తిరుపతి ప్రచారానికి పవన్ కళ్యాణ్
  • వచ్చేవారంలో రోడ్ షో, బహిరంగ సభ
  • క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బీజేపీతో పొత్తుకు కట్టుబడి తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి రత్నప్రభ గెలుపునకు కృషి చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ అరాచక పాలనను ఎండగట్టాలంటే బీజేపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చేవారం తిరుపతిలో పవన్‌ కళ్యాణ్ రోడ్‌ షోతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అంతరించిపోయిందని.. రానున్న రోజుల్లో జనసేన, బీజేపీ కలసి ప్రజాసమస్యల మీద పోరాటం చేస్తాయన్నారు.
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, ఇతర నేతలతో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు.. ఉప ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. తన విజయానికి సహకరించాలని రత్న ప్రభ పవన్‌ను కోరారు. ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు.

జనసేనాని తిరుపతి ప్రచారానికి వెళతారా.. దూరంగా ఉంటారా అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. దీనికి కారణం లేకపోలేదు.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ దూరంగా ఉన్నారు. లోకల్ లీడర్లు ఆ బాధ్యతల్ని తీసుకున్నారు. తిరుపతి వెళతారా లేదా అని సందేహాలు మొదలయ్యాయి. కానీ ఉప ఎన్నికలో ప్రచారానికి జనసేన అధినేత పక్కాగా వెళతారని మనోహర్ కూడా క్లారిటీ ఇచ్చేశారు.

ఏపీలో తిరుపతి ఉప ఎన్నికతో హడావిడి కనిపిస్తోంది. నోటిఫికేషన్ రావడంతో పాటూ అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రధాన పార్టీలు వ్యూహాలను సిద్ధం చేశాయి. వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన తరపున రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ చింతా మోహన్‌లు బరిలోకి దిగారు. తిరుపతి ఉప ఎన్నికకు ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.. ఈ నెల 31న పరిశీలిస్తారు.. ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.

తిరుపతి ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా జెండా ఎగురవేయాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీలు ప్రత్యేకంగా కమిటీలను రంగంలోకి దింపాయి. లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్‌లను టీడీపీ నియమించింది.. అక్కడ గెలుపు బాధ్యతల్ని వారికి అప్పగించారు. వైఎస్సార్‌సీపీ కమిటీల్లో మంత్రులు కూడా ఉండటం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.