యాప్నగరం

చిత్తూరు: మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఆత్మహత్యాయత్నం.. ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య వివాదం

Palamaner Ex Mla Nanjappa Son మాజీ ఎమ్మెల్యే కుమారుల మధ్య ఆస్తి వ్యవహారం చిచ్చురేపింది. కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మనస్తాపంతో చిన్న కుమారుడు శంకరప్ప ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అడ్డుకుని ఒంటిపై నీళ్లు పోశారు. ఆస్తి విషయంలో అన్నతో తమ్ముడికి వివాదం. ఈ ఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన శంకరప్ప కుమారుడు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 23 May 2023, 1:46 pm
చిత్తూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో ఆస్తి వ్యవహారంపై వివాదంరేగింది. తన అన్న ఆస్తి పంచడం లేదని మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలంరేపింది. పుంగనూరు తూర్పుమొగశాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పలమనేరు మాజీ ఎమ్మెల్యే నంజప్పకు వెంకటరత్నం, శంకరప్పలు కుమారులు.
Samayam Telugu Palamaner Ex Mla Nanjappa


కొన్నేళ్లుగా ఇద్దరు కొడుకుల మధ్య ఆస్తి పంపకాలపై వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న కుమారుడు శంకరప్ప.. ఆస్తి విషయంలో వివాదంతో మనస్తాపం చెందాడు. ఇంటి ఆవరణలో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి బాటిల్‌ లాక్కొని ఒంటిపై నీళ్లు పోశారు. ఈ ఘటన తర్వాత శంకరప్ప కుమారుడు నంజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంజప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి 1962లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తదనంతరం ఉన్న ఆస్తుల విషయంలోనే కుమారుల మధ్య వివాదం నడుస్తోంది.

పెద్దపంజాణి మండలం ముత్తుకూరు, పుంగనూరు పరిసరాల్లో మాజీ ఎమ్మెల్యే కుమారులకు భూములు ఉన్నాయి. అందులో పెద్ద కుమారుడు వెంకటరత్నం.. చిన్న కుమారుడు శంకరప్పకు రావాల్సిన భాగం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆస్తి విషయమై పెద్దమనుషుల్ని కూర్చోబెట్టి పంచాయతీల్లో తీర్మానం కూడా చేశారు. అయినా తమకు ఆస్తిలో భాగం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు శంకరప్ప చెబుతున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశానని.. ఆ ఆస్తుల వ్యవహారంపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో ఆస్తి వివాదం పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది.
పుంగనూరులో మరో విషాద ఘటన జరిగింది. నక్కబండలో నివాసం ఉండే అస్లాం అనే వ్యక్తి.. ఇంటికి దగ్గరలో ఉండే చెరువు వద్ద ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అస్లాంకు 85 శాతం శరీరం కాలిపోవడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడిని పోలీసులు ప్రశ్నించగా.. మంటలు ఎలా అంటుకన్నాయో తెలియదని చెప్పాడని అంటున్నారు. అతడు గంజాయి మత్తులోనే ఇలా చేశాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అస్లాంది పులిచెర్ల మండలం కల్లూరు కాగా.. పుంగనూరు నక్కబండకు చెందిన ఆస్మాతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయ్యింది. అప్పటి నుంచి ఇద్దరు పుంగనూరులోనే నివాసం ఉంటున్నారు. అయితే అస్లాం గంజాయికి బానిసగా మారాడని చెబుతున్నారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.