యాప్నగరం

TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం... ఎల్లుండి తిరుమలకు సీఎం జగన్

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నారు. ఇందుకోసం సోమవారం సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. మంగళవారం సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Samayam Telugu 25 Sep 2022, 12:17 pm
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు ముస్తాబయ్యాయి. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిబంధనల మధ్య జరుగుతున్న బ్రహ్మో్త్సవాలను ఈసారికి భక్తుల మధ్య బ్రహ్మాండంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తిచేసింది. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో స్వామివారి వాహన సేవలను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు.
Samayam Telugu YS Jagan


గరుడోత్సవం రోజున ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకోనున్నారన్న అంచనాతో సుమారు ఆరు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. టీటీడీ, పోలీసు, రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో ఆలయ మాడవీధుల్లో గ్యాలరీలు, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను సిద్ధం చేశారు. భక్తులు మాడవీధుల్లోకి క్యూలైన్ల ద్వారా ప్రవేశించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి అక్టోబరు ఐదో తేదీ వరకు అంగరంగవైభవంగా జరగనున్నాయి. శ్రీనివాసుడి అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యేలా టీటీడీ ముహూర్తం నిర్ణయించింది. ధ్వజారోహణానికి ముందురోజు అంటే సోమవారం సాయంకాలం భగవన్నారాయణుని సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం అంకురార్పణ జరుగుతుంది. మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మాడవీధుల్లో పెద్దశేషవాహనంపై ఊరేగే ఉత్సవమూర్తిని దర్శించుకుంటారు. ఈ ఘట్టంతో పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల విద్యుత్తు కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.