యాప్నగరం

ఇంట్రెస్టింగ్.. సీపీఐ నేత నారాయణకు వైద్యం చేసిన వైసీపీ ఎంపీ

Tirupati MP Gurumurthy మానవత్వం చాటుకున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి తన బాధ్యతను నెరవేర్చారు. సీపీఐ నేత నారాయణ కాలికి గాయమై నడవలేని స్థితిలో ఉండగా.. ఎంపీ గురుమూర్తి ఫిజియోథెరపీ చేసి తాత్కలికంగా కట్టుకట్టారు.

Samayam Telugu 24 Nov 2021, 11:22 am
భారీ వర్షాలు, వరదలతో చిత్తూరు జిల్లా అతలాకుతలమైంది. కొన్ని ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంపు బాధితులను పరామర్శించేందుకు అన్ని పార్టీల నాయకులు వెళ్తున్నారు. ఈ క్రమంలో రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువుకు గండి పడి.. మునిగిపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మంగళవారం వచ్చారు.
Samayam Telugu సీపీఐ నేత నారాయణ కాలికి గాయం


కుప్పం బాదురుకు ఆయన రాగా.. అక్కడి నుంచి కొండపైకి కి.మీ వరకు నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్దకు వచ్చారు. అయితే కొండ మీద నుంచి కిందకు దిగే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో నారాయణ కుడి కాలు బెణికింది. కాలుకు వాపు రావడంతో ఆయన పైకి లేవలేక.. అక్కడే కూర్చుండి పోయారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి గౌతమ్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ.. అక్కడికి చేరుకున్నారు.

అక్కడే కూర్చున్న నారాయణను పలకరించారు. ఆయన కాలు బెణికిన విషయం తెలుసుకున్న ఎంపీ గురుమూర్తి ఫిజియోథెరపీ చేయించి.. తాత్కాలికంగా కట్టుకట్టారు. ఆయన స్వతహాగా ఫిజియోథెరపీ డాక్టర్ కావడంతో నారాయణకు వైద్యం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వాహనంలో నారాయణ ఆసుపత్రికి వెళ్లిపోయారు. అటు వైఎస్సార్సీపీ నేతలు, ఇటు సీపీఐ పార్టీ నేతలు ఒకే శిబిరంలో చేరడంతో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కాగా.. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకు ఎంపీ గురుమూర్తి ఫిజియోథెరపిస్టుగా పనిచేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.