యాప్నగరం

ఆంధ్రాలో షాక్ కొట్టేలా పెట్రోల్ ధరలు.. రూ. 200 దాటే ఛాన్స్.. సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరల పెరుగుదలపై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 27 Aug 2021, 3:08 pm
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్ ధరలపై తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిల్ ధరలను పూర్తిగా తగ్గిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు, దేశంలోనే అత్యధిక ధరలకు ఏపీలో అమ్ముతున్నారని విమర్శించారు. గత టీడీపీ హాయాంలో 60 రూపాయిలు ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు డబుల్ సెంచరీ వైపు వెళ్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


2018లో టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచితే.. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఆ భారం ప్రజలపై పడకుండా లీటర్‌కు రూ. 2 తగ్గించారని బోండా ఉమా గుర్తు చేశారు. చమురు ఉత్పత్తులపై స్టేట్ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్, జీఎస్టీ, రోడ్ల సెస్ పేర్లతో ట్యాక్సుల మీద ట్యాక్సులేస్తూ జగన్ ప్రభుత్వం బాదుడు కార్యక్రమం చేపట్టిందని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు.

జగన్ ప్రభుత్వ అసమర్థతతో లీటర్ పెట్రోలు ధర రూ. 200 దాటినా ఆశ్చర్యపడక్కర్లేదని బోండా ఉమా విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసం పెట్రోల్ ధరలు పెంచుతున్నామని మంత్రులు పేర్కొనడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఎక్కడా ఒక కిలో మీటర్ కూడా రోడ్డు వేసింది లేదని, ఒక్క గుంత పూడ్చింది లేదని విమర్శించారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టబోయే నిరసన దీక్షల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని, జగన్ దోపిడీని ఎండగట్టాలని బోండా ఉమా పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.