యాప్నగరం

దండుపాళ్యం బ్యాచ్ కంటే కిరాతకులు.. పోలీసులకే మైండ్ బ్లాక్

కృష్ణా జిల్లాలో అనేక హత్యలకు పాల్పడిన ముఠాను పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి సరాదాల కోసం, జల్సాలకు డబ్బుల కోసమే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.

Samayam Telugu 21 Jun 2021, 12:52 pm
పెనమలూరు పోలీసుల అదుపులో ఉన్న కిరాతక ముఠా అరాచకాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ముఠా సభ్యులు విచారణలో భాగంగా వెల్లడిస్తున్న అరాచకాలు, హత్యలకు వేసిన పథకాలు పోలీసులనే షాక్‌కు గురిచేస్తున్నాయి. పేరుమోసిన నేరస్థుల్లా అవలీలగా ప్రాణాలు తీసే వీరి తీరుపై పోలీసు ఉన్నతాధికారులు నోరెళ్లబెడుతున్నారు. పెనమలూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో మరో ఐదుగురిని హత్య చేసి బంగారం చోరీ చేసేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్న తరుణంలోనే పోలీసులకు పట్టుబడడంతో హత్యల పరంపరకు బ్రేక్‌ పడింది.
Samayam Telugu vijayawada police cracks elderly couple murder mystery gang arrested
దండుపాళ్యం బ్యాచ్ కంటే కిరాతకులు.. పోలీసులకే మైండ్ బ్లాక్


​ఆటోడ్రైవర్లుగా...

ఈ నర హంతకులు తొలి హత్యను రిహార్సల్‌గా తీసుకొన్నారు. వీరు మొత్తం ఐదుగురు కాగా నలుగురు అత్యంత క్రూరంగా వ్యవహరించే వారని తెలుస్తోంది. ఐదో వ్యక్తి వీరికి సహాయకుడిగా వ్యవహరించేవాడు. ఈ ముఠా పోరంకి, తాడిగడపల్లో ఆటో డ్రైవర్లుగా వ్యవహరించేవారు. నిందితుల్లో ఒకరికి చోరీల నేపథ్యం ఉంది. అతడి సహాయంతోనే నిస్సహాయులైన వృద్ధులను హత్య చేసేందుకు వీరు ముఠాగా ఏర్పడ్డారు. పోరంకి విష్ణుపురం కాలనీలో వీరు గతేడాది డిసెంబరులో అర్ధరాత్రి హత్య చేశారు. తర్వాత రోజు ఉదయం నుంచే వీరు ఆమె ఇంటి సమీపంలో నిఘాలో నిమగ్నమయ్యారు.

​ఎవరికీ అనుమానం రాకుండా...

హతురాలి మృతదేహం వద్దకు ఎంత మంది వచ్చారు?..ఎవరెవరు వచ్చారు.. ఎంతసేపు ఉన్నారు..ఎంత సేపటి తర్వాత అంత్యక్రియలకు మృతదేహాన్ని తరలించారు. అన్న అంశాలను వీరు గమనించడం, ఆ తర్వాత మృతదేహం శ్మశానానికి తీసుకువెళ్లే వరకూ అనుసరించేవారు. కరోనా సమయం కావడంతో బంధుమిత్రులు ఎవరూ రాకపోవడం, గంట వ్యవధిలోనే అంత్యక్రియలు పూర్తి అవడం.. వీరిని మరిన్ని హత్యలు చేయడానికి పురికొల్పింది.

​నెలకో హత్య

నెలకో హత్య చొప్పున హంతకులు విచ్చలవిడిగా హత్యాకాండను కొనసాగించినట్లు తేలింది. ఇప్పటి వరకు పోరంకిలో నలుగురు వృద్ధులను హత్య చేశారు. నిందితుల్లో ఒకరు వీరి ముక్కు, నోటిని దుప్పటితో మూసివేయడం, మరో ఇద్దరు కాళ్లు చేతులు కదలకుండా పట్టుకోగా.. ఇంకొకరు పీకనులిమి చంపేడం.. అంతా 20 నిముషాల్లో పూర్తి చేసుకొని బయట పడేవారు. ఆ సమయంలో వృద్ధులు ప్రాణభయంతో పెనుగులాడేవారు.

​అతి క్రూరంగా హత్యలు..

ఈ ముఠా కేవలం ఒంటిపై ఉన్న ఆభరణాల్లో పెద్దవి మాత్రమే చోరీ చేసుకుపోయేవారు. కొన్ని ఆభరణాలు మృతుల ఒంటిపైనే ఉండడంతో కుటుంబ సభ్యులకు కూడా అవి హత్యలనే అనుమానం వచ్చేది కాదు. నాలుగు హత్యల్లో ఇద్దరు వృద్ధులను మరింత క్రూరంగా చంపేసినట్లు తెలుస్తోంది. నెత్తుటి మరకలను పాతదుస్తులతో తుడిచేసి వీటిని బయటకు తీసుకొచ్చి బందరు కాల్వలో పారేసినట్లు సమాచారం.

​చోరీ సొమ్ము కుదువపెట్టి పంపకాలు..

చోరీ చేసిన నగలను నిందితులు పలుచోట్ల కుదువపెట్టి సొమ్ము చేసుకున్నారు. దీంతో వాటిని రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. వీటి ఆధారంతోనే కేసు దర్యాప్తును పకడ్బందీగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హంతకులు ఆభరణాలను ఒకేచోట కాకుండా అవనిగడ్డ, నాగాయలంక, తెనాలి, మంగళగిరి, గుంటూరుల్లోని తాకట్టు, ఫైనాన్స్‌ సంస్థల్లో కుదువ పెట్టినట్లు సమాచారం. ఈ హత్యలపై రెండ్రోజుల్లో పెనమలూరు పోలీసులు కేసులు నమోదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

​విబేధాలతో దొరికారిలా...

నిశ్శబ్ద హత్యల్లో ఆరితేరిన ఈ హంతకుల నడుమ చివర్లో విబేధాలు తలెత్తినట్లు పోలీసులు చెబుతున్నారు. బంగారు ఆభరణాల తాకట్టు ద్వారా అందిన మొత్తాలను పంచుకొనే వ్యవహారంలో వీరి నడుమ వివాదాలు చోటుచేసుకున్నారు. ఇద్దరు ఒక గ్రూపుగా, మిగతా ముగ్గురు మరో బృందంగా విడిపోవాలని నిర్ణయించుకొన్నట్లు తెలిసింది. చివరగా కంకిపాడులో ఓ వృద్ధురాలిని చంపి ఆ తర్వాత ఎవరికి వారుగా విడిపోవాలని భావించారు. తీరా ఈ హత్యకు వెళ్లిన సమయంలో వీధికుక్కలు వెంటపడటంతో ప్లాన్ బెడిసికొట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.