యాప్నగరం

మాాజీ మంత్రి కళాపై అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు

వైఎస్ఆర్సీపీ నేత, పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డిపై రామతీర్థంలో రాళ్లదాడి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఆధ్వర్యంలోనే జరిగిందంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.

Samayam Telugu 24 Jan 2021, 8:50 am
ఇటీవల రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం ఘటనను పరిశీలించడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డిపై జరిగిన రాళ్లదాడి వెనుక మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు పాత్ర ఉందని పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మూడు రోజుల కిందట ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కేవలం తాము విచారణకు మాత్రమే పిలిచామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదుచేసిన కేసును రద్దుచేయాలని కోరుతూ కళా వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు.
Samayam Telugu టీడీపీ నేత కళా వెంకట్రావు
TDP leader K Kala Venkata Rao


ఆయన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. కిమిడి కళా వెంకటరావు విషయంలో తదుపరి విచారణ వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాధ్‌రాయ్‌ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రామతీర్థంలో పర్యటించిన సందర్భంగా ఆయన వాహన శ్రేణిపై రాళ్లు, చెప్పులు వేయించారనే అభియోగంపై విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఠాణా పోలీసులు కళా వెంకటరావుపై కేసు నమోదు చేశారు.

తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని అభ్యర్థించిన కళా.. ఎంపీ విజయసాయిరెడ్డిని వ్యాజ్యంలో ప్రతివాదిగా పేర్కొన్నారు. పిటిషనరు తరఫున లాయర్ టి.నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి విషయంలో చోటు చేసుకున్న ఘటన విషయంలో కళా వెంకటరావుకు ఎలాంటి సంబంధం లేదని, అక్రమంగా కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

రామతీర్థంలో చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చిన తర్వాత అదే రోజు విజయసాయిరెడ్డి కూడా పోలీసులు అనుమతించడం.. ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ నేతపై రాళ్లదాడి జరిగింది. అయితే, ఈ కేసులో చంద్రబాబునాయుడు, టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు సహా పలువురు టీడీపీ నేతలను నిందితులుగా చేర్చుతూ పోలీసులు కేసు నమోదుచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.