యాప్నగరం

వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ

Life Threat to VV Lakshminarayana: విశాఖపట్నం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణ హాని ఉందని విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని లక్ష్మినారాయణ ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని సీపీని లక్ష్మీనారాయణ కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Authored byవంకం వెంకటరమణ | Samayam Telugu 26 Apr 2024, 6:46 pm
Life Threat to VV Lakshminarayana: ఏపీ ఎన్నికల వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తనకు ప్రాణహాని ఉందంటూ సీబీఐ మాజీ జేడీ, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మినారాయణ పోలీసులను ఆశ్రయించారు. విశాఖపట్నంలో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ విశాఖఫట్నం పోలీస్ కమిషనర్‌ను కలిసి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని లక్ష్మినారాయణ పోలీసులను కోరారు. దీనికి సంబంధించి ఆధారాలను కూడా సమర్పించారు. లక్ష్మినారాయణ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Samayam Telugu JD Lakshmi narayana
నన్ను చంపేందుకు కుట్ర.. పోలీసులకు జేడీ లక్ష్మినారాయణ ఫిర్యాదు


పోలీసులకు ఫిర్యాదు చేసిన వచ్చిన అనంతరం మాట్లాడిన లక్ష్మినారాయణ.. పలు కీలక విషయాలు వెల్లడించారు. దేశాన్ని కుదిపేసిన కేసులను సీబీఐలో పనిచేసిన సమయంలో చూశానన్న లక్ష్మినారాయణ.. ఆ సమయంలో చాలా బెదిరింపులు వచ్చాయని చెప్పారు. అప్పట్లో ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని రక్తంతో కూడా కంప్లైంట్ లెటర్ రాశామని చెప్పారు. 2018 తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానన్న లక్ష్మినారాయణ.. ప్రస్తుత ఎన్నికల్లో విశాఖ ఉత్తరంలో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అయితే పాత కేసుల్లో నిందితుల శిష్యులు తమ బాస్‌కు శిక్షపడేలా చేశానని నా మీద కక్ష కట్టారని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ చెప్పారు.

తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ పోలీసులకు జేడీ లక్ష్మి నారాయణ ఫిర్యాదు


" ఇక్కడ ఆ వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు. మా కుటుంబసభ్యులు కూడా చాలా భయపడ్డారు. నాకు వచ్చిన సమాచారం ద్వారా సీపీని కలిసి ఫిర్యాదు చేశా. ఒకసారి మీటింగ్‌లో మా గురువు గారిని చాలా కష్టబెట్టారు, ఎలా అయినా అంతుచూస్తానన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వాళ్ళే ఈ కుట్ర పన్నారు. సీపీ స్పందించి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాధారణంగా నేను సెక్యూరిటీ కోరుకోలేదు. నేను ప్రజల మనిషిని. ఇప్పుడు కూడా బెదిరింపులపై ఫిర్యాదు చేసే వాణ్ని కాదు. అయితే మా కుటుంబసభ్యులు భయపడుతూ ఉండటం వలనే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా బెదిరిస్తూ పోస్టులు వచ్చాయి. తేలికగా వదిలేసే విషయం కాదనిపించి ఫిర్యాదు చేశాను. నాకు ఏదైనా జరగరాని నష్టం జరిగితే దానికి తప్పకుండా బాధ్యులు వాళ్లే" అని లక్ష్మినారాయణ ఆరోపించారు.

మరోవైపు ఇటీవలే జైభారత్ నేషనల్ పార్టీని స్థాపించిన లక్ష్మినారాయణ.. పలుచోట్ల అభ్యర్థులను సైతం బరిలో నిలిపారు. తాను కూడా స్వయంగా విశాఖపట్నం ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జైభారత్ నేషనల్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్నారు. విశాఖ నార్త్ సీటు నుంచి కూటమి తరుఫున బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, వైసీపీ తరుఫున కేకే రాజు పోటీ చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గాలి జనార్ధన్ రెడ్డి, కేకే రాజు పేర్లు ప్రస్తావించడం హాట్ టాపిక్‌గా మారింది.
రచయిత గురించి
వంకం వెంకటరమణ
వంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.