యాప్నగరం

విశాఖ తీరంలో విషాదం..!! ఆ రోజు సాగనంపిన అతిథి.. ఈ రోజు ఇలా..?

విశాఖ తీరానికి మూడు రోజుల కిందట కొన ఊపిరితో కొట్టుకొచ్చిన డాల్ఫిన్‌ను మత్స్యకారులు.. అధికారులు కాపాడి సముద్రంలోకి వదిలారు. అయితే ఆదివారం రోజు గుడ్లవానిపాలెం బీచ్‌కి ఒక డాల్ఫిన్ కళేబరం కొట్టుకొచ్చింది. దీంతో ఆ రోజు కొన ఊపిరితో తీరానికి వచ్చిన డాల్ఫిన్.. నిన్న మృతిచెందిన డాల్ఫిన్ ఒకటేనా అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 8 Nov 2021, 2:44 pm
విశాఖ సముద్ర తీరం ఎంతో అందంగా ఉంటూ మరెంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. విశాఖ తీర అందాలను చూడటానికి అప్పుడప్పుడు సముద్రంలో ఉండే ప్రత్యేక అతిథులు కూడా అలా వచ్చి ఇలా వెళ్తుంటాయి. అయితే ఈ సారి మాత్రం అలా వచ్చిన ఆ అతిథి.. ఇలా విగతజీవిలా కనిపించి విశాఖ తీరంలో విషాదం నింపాడు.
Samayam Telugu విశాఖ సాగర తీరం


విశాఖ తీరానికి అప్పుడప్పుడు డాల్ఫిన్లు వస్తూ సందడి చేస్తుంటాయి. అయితే కొన్ని డాల్ఫిన్లు గాయపడి తీరానికి చేరుకుంటుంటాయి.. మూడు రోజుల కిందట కూడా ఒక డాల్ఫిన్ అలాగే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ రుషికొండ తీరానికి చేరింది. బీచ్‌లో ఉన్న పర్యాటకులు.. మత్స్యకారులు గమనించి ఆ అతిథికి సపర్యలు చేసి ప్రాణాలతో సముద్రంలోకి వదిలారు.

అయితే ఆదివారం రోజున గుడ్లవారిపాలెం తీరానికి ఒక డాల్ఫిన్ కళేబరం కొట్టుకొచ్చింది. దీంతో ఈ కళేబరం ఆ రోజు కొన ఊపిరితో రుషికొండ బీచ్‌కు వచ్చిన డాల్ఫిన్‌దే అని మత్స్యశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 60 కిలోల పైగా బరువున్న డాల్ఫిన్ కళేబరాన్ని చూసి అక్కడి వారందరూ అయ్యో అనుకుంటున్నారు. సముద్ర జలాలు విషపూరితం కావడమో.. సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు తగిలో ఈ డాల్ఫిన్ మృతిచెంది ఉంటుందని అనుమానిస్తున్నారు.

గతంలో కూడా శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో కూడా డాల్ఫిన్ మృతిచెందింది. వజ్రపుకొత్తూరు మండలంలోని కంబాలరాయుడు పేట తీరానికి ఓ డాల్ఫిన్‌ కొట్టుకొచ్చింది. సుమారు నాలుగన్నర అడుగుల పొడవు, 100 కిలోల బరువు ఉంది. దీన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించి సముద్రంలో తిరిగి విడిచి పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది అప్పటికే చనిపోవడంతో సమీప దిబ్బల్లోనే ఖననం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.