యాప్నగరం

విశాఖ: మొదటి సమావేశంలోనే జీవీఎంసీ సంచలన తీర్మానం!

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సంబంధించి జీవీఎంసీ మొదటి సమావేశంలో సంచలన తీర్మానం చేసింది.

Samayam Telugu 9 Apr 2021, 7:18 pm
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కార్పొరేషన్‌ ఎన్నికల తర్వాత జరిగిన మొట్టమొదటి సర్వసభ్య సమావేశంలోనే ఈ మేరకు తీర్మానించారు. ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయసాయిరెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన మిగతా ఎంపీలు రాజీనామా చేయాలని తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీల కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తూనే ఉన్నామని చెప్పారు.
Samayam Telugu జీవీఎంసీ


అంతకు ముందు టీడీపీ కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ, అనకాపల్లి ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజీనామా అస్త్రాన్ని ఢిల్లీలో ప్రయోగిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాదన్నారు. ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసినంత మాత్రాన సీఎం జగన్‌కు ఏం నష్టమూ జరగదన్నారు. రాజీనామా చేసిన ఎంపీలను విశాఖ ప్రజలు తమ హృదయాల్లో చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటారన్నారు.

సీపీఎం కార్పొరేటర్‌ గంగారావు మాట్లాడుతూ.. విశాఖలోని స్టీల్‌ ప్లాంట్‌, పోర్టు ప్రైవేటీకరణ జరిగితే నగరం నామరూపాల్లేకుండా పోతుందని హెచ్చరించారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల సమయంలో జీవీఎంసీకి చెందిన అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీ వెళ్లి అక్కడే నిరసన తెలపాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.