యాప్నగరం

మహిళ సమాధానంతో కంగుతిన్న మంత్రి.. వెంటనే అధికారులపై సీరియస్

పార్వతీపురం జిల్లా సాలూరులో అధికారులపై డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సీరియస్ అయ్యారు. ప్రభుత్వ పథకాలను వాలంటీర్ ఇస్తున్నారని ఎలా చెబుతారని మండిపడ్డారు. ఇలా అయితే మీరు సస్పెండ్ అవుతారని..

Authored byAshok Krindinti | Samayam Telugu 14 May 2022, 5:12 pm
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి పలు చోట్లు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండగా.. కొన్ని చోట్ల నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయని కొన్ని చోట్ల చెబుతుండగా.. మరికొన్ని చోట్ల సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. ముఖ్యంగా రోడ్లు, తాగునీరు, పింఛన్లు, పెరిగిన నిత్యావసర ధరలపై నిరసన వ్యక్తమవుతోంది. ఆయా సమస్యలు వింటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు.
Samayam Telugu అధికారులపై డిప్యూటీ సీఎం సీరియస్


ఇదిలా ఉండగా.. పార్వతీపురం మన్యం జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో లబ్దిదారులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరకు ఊహించని సమాధానం వచ్చింది. సాలూరు మున్సిపాలిటీ ఒకటవ వార్డు గుమ్మడంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఓ మహిళతో మాట్లాడుతూ.. 'సంక్షేమ పథకాలు మీకు ఎవరు ఇస్తున్నారు..?' అని రాజన్నదొర ప్రశ్నించగా.. వాలంటీర్ ఇస్తున్నారంటూ ఊహించని సమాధానం ఇచ్చింది.

దీంతో వెంటనే చిర్రెత్తిపోయిన డిప్యూటీ సీఎం.. అక్కడున్న మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బందిపై సీరియస్ అయ్యారు. ఇటీవల సాలూరు మండలం శివారాంపురంలో కూడా వాలంటీర్ పథకాలు ఇస్తున్నారని ప్రజలు చెబుతున్నారని.. ఇలా అయితే ఎంపీడీఓ, కమిషనర్ సస్పెండ్ అవుతారని హెచ్చరించారు. 'చంద్రబాబు టైమ్‌లో పథకాలు ఎవరిచ్చారంటే చంద్రన్న ఇచ్చారని చెప్పేవారు.. కానీ ఇప్పుడు జగనన్న ఇస్తే వాలంటీర్ ఇస్తున్నారని చెబుతున్నారు. ఇది కరెక్ట్ కాదు..' అని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.