యాప్నగరం

ఇళ్ల కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. లోన్లపై స్పెషల్ ఆఫర్ ప్రకటించిన బ్యాంకు

ఒకవైపు ద్రవ్యోల్బణం ముప్పు పెరుగుతోంది. ఆకాశాన్నంటుతోన్న ద్రవ్యోల్బణం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు సెంట్రల్ బ్యాంకు సిద్ధమవుతోంది. తదుపరి మీటింగ్‌లో ఎలాగైనా వడ్డీ రేట్లను పెంచాలని చూస్తోంది. ఈ పెంపు కంటే ముందే క్రెడిట్ డిమాండ్ అందుకోవడం కోసం బ్యాంకు ఆఫ్ బరోడా గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. పరిమిత కాల వ్యవధిలో వడ్డీ రేట్లను తగ్గించడమే కాకుండా.. వీటిపై నిల్ ప్రాసెసింగ్ ఫీజులను విధిస్తోంది. కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఈ విధంగా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది.

Authored byKoteru Sravani | Samayam Telugu 22 Apr 2022, 7:59 pm

ప్రధానాంశాలు:

  • గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన బీఓబీ
  • 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటన
  • జూన్ చివరి వరకు అందుబాటు
  • అన్ని రుణాలకు ఈ తగ్గింపు వడ్డీ రేట్లు వర్తింపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bank of Baroda cuts home loan rates by 25 bps till June end
ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంకు ఆఫ్ బరోడా ఇళ్ల కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు ప్రకటించింది. దీంతో ఇళ్ల రుణాలు 6.50 శాతం వడ్డీ రేటుకే లభిస్తున్నాయి. జూన్ 30 వరకు ఈ స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని బ్యాంకు ఆఫ్ బరోడా శుక్రవారం ప్రకటించింది. ఈ కాలంలో ప్రాసెసింగ్ ఫీజులపై 100 శాతం మాఫీని కూడా ఇస్తోంది. ఈ రేటు కొత్త లోన్లు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్లకు రెండింటికీ అందుబాటులో ఉంటుందని బ్యాంకు ఆఫ్ బరోడా పేర్కొంది. అన్ని లోన్ మొత్తాలకు కూడా ఈ రేట్లు అందుబాటులో ఉంటాయి. అయితే సిబిల్ స్కోర్ 771, ఆపైన ఉన్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
గత కొన్ని నెలలుగా ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగాయని బ్యాంకు తెలిపింది. ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 6.50 శాతం వడ్డీ రేటుతో పరిమిత కాలంలో, స్పెషల్ ఆఫర్‌గా ఇళ్ల కొనుగోలుదారుల కోసం ఈ ఆఫర్‌ను అందించడం ఆనందదాయకంగా ఉందని బ్యాంకు పేర్కొంది. ఈ మూమెంటాన్ని కంటిన్యూ చేయాలని తాము భావిస్తున్నామని, ప్రజలు తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌ను కోరుకుంటున్నారని బ్యాంకు ఆఫ్ బరోడా తెలిపింది.

Also read : అటవీ ప్రాంతం నుంచి అమెజాన్‌కి.. భారీ ప్యాకేజీతో లండన్‌లో ఉద్యోగం

ఇళ్ల రుణాలపై బ్యాంకు ఆఫ్ బరోడా వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండోసారి. తొలిసారి కూడా పరిమితి కాలంలో ఆఫర్‌ను తీసుకొచ్చింది. చివరిసారి అక్టోబర్ 7, 2021న హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, 6.50 శాతానికి అందించింది. అంతేకాక స్పెషిఫిక్ బారోవర్స్‌కి మార్చి 31, 2022 వరకు 6.5 శాతం వడ్డీ రేటునే ఆఫర్ చేసింది. ప్రస్తుతం మరోసారి ఈ వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థికాంశాల కారణంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచబోతున్న తరుణంలో.. బ్యాంకు క్రెడిట్ డిమాండ్‌ను ట్యాప్ చేసేందుకు తాత్కాలికంగా వడ్డీ రేట్లకు కోత పెట్టింది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుండటంతో.. తదుపరి మానిటరీ పాలసీ కమిటీలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచనుందని తెలుస్తోంది.

Also read : ధోనిని ఆకాశానికెత్తిన ఆనంద్ మహింద్రా.. ట్వీట్ వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.