యాప్నగరం

అయ్యయో.. అదానీ పడిపోయారే.. ఒక్క రోజే రూ.57 వేల కోట్ల లాస్!

Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిసారి రెండో స్థానాన్ని దక్కించుకున్న గౌతమ్ అదానీకి ఆ ముచ్చట ఎంతో కాలం నిలవలేదు. అదానీ గ్రూప్ స్టాక్స్ వాల్యూ పడిపోతుండటంతో.. గౌతమ్ అదానీ భారీగా సంపదను కోల్పోయారు. నెంబర్.2 కిరీటాన్ని పోగొట్టుకున్నారు. మళ్లీ జెఫ్ బెజోస్ తన స్థానాన్ని తాను దక్కించుకున్నారు.

Authored byKoteru Sravani | Samayam Telugu 27 Sep 2022, 6:25 pm
Gautam Adani: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఒడుదుడుకులకు గురవుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్లు రెండు రోజుల నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో అదానీ గ్రూప్(Adani Group) స్టాక్స్ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో అదానీ గ్రూప్‌ కంపెనీల అధినేత, బిలీనియర్ గౌతమ్ అదానీకి భారీగా దెబ్బకొట్టింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌(Jeff Bezos)ను వెనక్కి నెట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్న అదానీ తన స్థానాన్ని కోల్పోయారు. ఆయనకు 7 బిలియన్ డాలర్ల మేర అంటే భారతీయ కరెన్సీ లెక్కల్లో రూ.57 వేల కోట్ల సంపద హరించుకుపోవడంతో.. అదానీ రెండో స్థానాన్ని కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ జాబితాలో ఈ విషయం వెల్లడైంది. కాగా, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మళ్లీ తన స్థానాన్ని తాను సంపాదించుకున్నారు. బెజోస్ సంపద సోమవారం 1.36 బిలియన్ డాలర్లు పెరగడంతో.. ఆయన మొత్తం సంపద 138 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది.
Samayam Telugu gautam adani loses no 2 status in the global rich list
అయ్యయో.. అదానీ పడిపోయారే.. ఒక్క రోజే రూ.57 వేల కోట్ల లాస్!


మార్కెట్లతో పాటు అదానీ గ్రూప్ స్టాక్స్‌కి నష్టాలే..

ప్రస్తుతం 7 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోవడంతో.. అదానీ సంపద(Adani Wealth) 135 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ప్రపంచంలో మూడో సంపన్నుడిగా నిలిచారు. అయితే ఈ క్యాలెండర్ ఇయర్‌ 2022లో అదానీ తన సంపదనను 58.5 బిలియన్ డాలర్లను పెంచుకున్నారు. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్ మినహాయించి.. మిగిలిన అదానీ స్టాక్స్ కూడా నేడు కిందకి పడిపోయాయి. ఈ స్టాక్స్ 3 శాతం వరకు నష్టపోయాయి. స్టాక్స్ పడిపోవడంతో.. గౌతమ్ అదానీ సంపద కూడా తగ్గిపోయింది. స్టాక్ మార్కెట్లు పడిపోతూ ఉండటంతో.. అదానీ గ్రూప్ స్టాక్స్ కూడా అతలాకుతలమవుతున్నాయి.

ఈ నెల 16న తొలిసారి నెంబర్.2లో అదానీ..

ఈ నెల 16వ తేదీన అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పెరగడంతో.. గుజరాత్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త ప్రపంచ కుబేరుల జాబితా(global rich list)లో తొలిసారి రెండో స్థానానికి వచ్చారు. హోల్సియం ఇండియా వ్యాపారాలైన ఏసీసీ, అంబుజా సిమెంట్‌లను కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22 లక్షల కోట్లకు ఎగిసింది. అదానీ గ్రూప్‌కు చెందిన తొమ్మిది లిస్టెడ్ కంపెనీల్లో.. నాలుగు కంపెనీలు ఈ ఏడాది రెండింతలకు పైగా లాభాలను ఆర్జించాయి. లిస్టెడ్ కంపెనీల సంపద పెరగడంతో.. ఆ సమయంలో టాటా గ్రూప్‌లను అధిగమించి కూడా అత్యంత విలువైన గ్రూప్‌గా అదానీ గ్రూప్ అవతరించింది.

అదానీతో పాటు అంబానీకి కరిగిపోయిన సంపద

ఇటీవల విడుదలైన ఐఐఎఫ్‌ఎల్ హెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్టు 2022లో కూడా అదానీ సంపద అనూహ్య స్థాయిలో పెరిగినట్టు వెల్లడైంది. రోజుకు ఆయన రూ.1,612 కోట్లను సంపాదిస్తున్నారని తెలిసింది. గత ఐదేళ్లలో అదానీ సంపద సుమారు 1,440 శాతం పెరిగింది. ఈ సమయంలో ఆయన పలు కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకున్నారు.

అదానీ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగొచ్చిన సమయంలో.. ప్రపంచ సంపన్నల జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) కూడా 11వ స్థానానికి పడిపోయారు. మార్కెట్లు క్రాష్ కావడంతో.. అంబానీ సంపద కూడా 2.83 బిలియన్ డాలర్లు కరిగి పోయింది. దీంతో అంబానీ సంపద 82.4 బిలియన్ డాలర్లకు చేరింది.

వచ్చే పదేళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..

మరోవైపు అదానీ గ్రూప్(Adani Group) వచ్చే పదేళ్లలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. సింగపూర్‌లో నిర్వహించిన ఫోర్బ్స్ గ్లోబల్ సీఈవో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ. వచ్చే పదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు పైగా అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. దీనిలో 70 శాతం వరకు ఎనర్జీ ట్రాన్సిషన్‌కే కేటాయించింది. మరో 45 గిగా వాట్స్ హైబ్రిడ్ రెన్యూవబుల్ పవర్ జనరేషన్ ద్వారా తమ గ్రూప్ రెన్యూవబుల్ పోర్టుఫోలియోను పెంచుకోవాలని అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే తాము ప్రపంచంలో అతిపెద్ద సోలార్ తయారీదారిగా ఉన్నామని, ఈ జనరేషన్‌ను మరింత పెంచాలనుకుంటున్నామని గౌతమ్ అదానీ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.